
దేశం మొత్తం ఇటు చూడాలనే అవిశ్వాసం: జగన్
దేశం మొత్తం ఇటువైపు చూడాలనే ఉద్దేశంతోనే తాము కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ: దేశం మొత్తం ఇటువైపు చూడాలనే ఉద్దేశంతోనే తాము కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ్తో సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంత పార్టీ ఎంపీలు ఆరుగురు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారని, ఆ తీర్మానానికి తాము మద్దతిస్తున్నామని తెలిపారు.
4 రాష్ట్రాల ఫలితాలే దేశమంతా వస్తాయని జగన్ హెచ్చరించారు. ఈ ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్‌కు బుద్ధి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ది వచ్చి ప్రజలకు మేలు చేయడానికి దేశం మొత్తం మీద ఇదే జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. అదే పార్టీకి చెందిన ఎంపిలు సోనియాపై అవిశ్వాం ప్రకటించారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ఓ సామాన్యుడు, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్న తాము విభజనను ఎలా అడ్డుకోగలం? అని ప్రశ్నించారు.
ఆర్టికల్-3 సవరణకు దేవెగౌడ మద్దతుకోరినట్లు జగన్ తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయం మరొకరికి జరుగకూడదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.