
లోక్‌సభలోనూ గ్యారంటీ లేదు: ఎం.వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో వస్తుందన్న గ్యారంటీలేదని బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి గురించి తప్ప యూపీఏ సర్కార్ సరైన హోంవర్క్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. దుర్మార్గమైన రాజకీయం చేస్తున్న కాంగ్రెస్‌కు ఉభయ భ్రష్టత్వం తప్పదని హెచ్చరించారు. ‘అన్ని విషయాలపై న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాక.. ప్రతిపక్షాన్ని సంప్రదించి ముందుకు వెళ్లి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేదికాద’న్నారు. బిల్లును రాజ్యసభలో పెడుతున్నట్టు హోం మంత్రి షిండే చెప్పి, ఛైర్మన్‌కు ఉత్తరం కూడా రాశారు.
బిల్లులో ఆర్థికాంశాలు ఉన్నాయని, లోక్‌సభలో పెట్టాలని న్యాయశాఖ చెప్పే వరకూ వీరికి తెలియదా..? అని ఆయన నిలదీశారు. బిల్లు ఆమోదం పొందకపోతే ఆ నెపాన్ని బీజేపీపై నెట్టాలని ప్రయత్నించారని వెంకయ్య ధ్వజమెత్తారు. ‘‘బిల్లుకు వ్యతిరేకంగా సీఎం, కేంద్రమంత్రులు ఏపీ నుంచి ఢిల్లీ దాకా ప్రకటనలు, దీక్షలు,సభల్లో నినాదాలు చేస్తున్నారు. హైకమాండ్‌కు అత్యంత సన్నిహితులైన వారు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. బిల్లు తెచ్చేదివారే, వ్యతిరేకించేదీ వారే, అలాంటప్పుడు బీజేపీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? కాంగ్రెస్‌కు సిగ్గుంటే మంత్రులు, ఎంపీలను అదుపులో పెట్టుకోవాలి. బీజేపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటే కాంగ్రెస్‌కు ఎందుకు? కాంగ్రెస్ ఎత్తుల గురించి చెప్పాలి. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను తాము సంతృప్తి పరిచేప్రయత్నాలు చేస్తున్నాం తప్ప షరతులు పెట్టడం లేద’’ని వెంకయ్య స్పష్టం చేశారు.
తక్షణం టీ బిల్లు పెట్టండి: అరుణ్ జైట్లీ
తెలంగాణకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, యూపీఏ ప్రభుత్వం తక్షణం ఉభయ సభల్లో బిల్లు తేవాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ తెలిపారు. మంగళవారం తన వెబ్‌సైట్‌లో ‘తెలంగాణపై యూపీఏ ఆంతర్యమేమిటి?’ అన్న అంశంపై ఒక వ్యాసం రాశారు. ‘‘గడచిన దశాబ్దంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై ఊగిసలాట ధోరణి కనబరిచింది. రాష్ట్ర ఏర్పాటుపై 2004లో హామీ ఇచ్చినప్పటికి, 2009 డిసెంబరు 9న సూత్రప్రాయంగా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించింది. తర్వాత మళ్లీ వెనకడుగు వేసింది. ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించినప్పటికీ, దానివల్ల ఉపయోగం లేకుండాపోయింది. యూపీఏ 2013లో మరోసారి నిర్ణయం తీసుకుంది. అయితే, మంత్రివర్గం దీన్ని చాలా ఆలస్యంగా ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల వచ్చిన వ్యతిరేక, సానుకూల అభిప్రాయాలను చర్చించాల్సిన ప్రక్రియ ప్రస్తుత సమావేశాల్లో ముందుకు సాగేలా లేదు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని మేం కోరాం.
అవేమీ కష్టమైనవి, అసాధ్యమైనవీ కావు. కానీ, యూపీఏ ఈ దిశలో ముందుకు సాగలేదు. తెలంగాణ బిల్లు రాజ్యాంగబద్ధంగా, రెండు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. నేను దానికి మద్దతిచ్చేందుకు చూస్తున్నా. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ల ఏర్పాటు సమయంలో ఎన్డీయే చాలా సమర్ధంగా వ్యవహరించింది. తెలంగాణపై యూపీఏ అలా వ్యవహరించడంలేదు. పార్లమెంటు సమావేశాలు మరో 8 రోజులు మాత్రమే జరుగుతాయి. వీటిలో రెండు శుక్రవారాలు కేవలం ప్రైవేటు మెంబరు కార్యకలాపాలకు రిజర్వ్ అయి ఉంటాయి. మిగిలింది 6 రోజులే. ఇప్పటికీ యూపీఏ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. బిల్లును చూస్తే అసలు ప్రభుత్వం న్యాయపరంగా, రాజ్యాంగపరంగా తెలంగాణ ఏర్పాటు చేసేందుకు తగినట్టుగా వ్యవహరిస్తోందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును యూపీఏ సాగదీస్తోందని అనుమానంగా ఉంది. తెలంగాణ ఏర్పాటు చేయలేని రీతిలో వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది’’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.