అవరోధమేమీ ఉండదు: సుశీల్‌కుమార్‌షిండే
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ-2 సర్కారు హయాంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో ఎలాంటి అవరోధమూ ఉండదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే పేర్కొన్నారు.వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఉద్ఘాటించారు. షిండే శుక్రవారం ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయం వెలుపల మీడియా ప్రతినిధులతో చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013ను తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ చివరి నిమిషంలో మూజువాణి ఓటుతో తీర్మానం చేసిన నేపధ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా షిండే స్పందిస్తూ.. ‘‘బిల్లు ఆమోదం పొందుతుంది.
అందుకు ఎలాంటి సమస్యా ఉండదు’’ అని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి పునర్వ్యవస్థీకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా అందనే లేదని.. దీనిపై తాము అటార్నీ జనరల్ న్యాయ అభిప్రాయాన్ని కోరనూ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా షిండే తెలిపారు. తుది బిల్లుపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రభావం ఏమీ ఉండదని.. తెలంగాణ ప్రక్రియను పూర్తిచేయటానికి న్యాయపరమైన అడ్డంకులేమీ రావని ఆయన చెప్పారు.
కిరణ్ వాదనను తిరస్కరించిన హోంశాఖ!
అంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు అసంపూర్ణంగా ఉందంటూ ముఖ్యమంత్రి కిరణ్ చేసిన వాదనను తిరస్కరిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలియవచ్చింది. ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో.. విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు తేదీ కోసం పార్లమెంటును సంప్రదించాలనే యోచనలో హోంశాఖ ఉన్నట్లు సమాచారం. విభజన బిల్లుకు సంబంధించి రాష్ట్రపతికి సిఫారసు చేయాల్సిన తదుపరి కార్యాచరణపై కేంద్ర మంత్రుల బృందం ఫిబ్రవరి 4న భేటీ అయ్యే అవకాశముందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి.