
రుణ వితరణకు అవుట్‌సోర్సింగ్ వద్దు
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా
న్యూఢిల్లీ: మొండి బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో రుణాల ప్రాసెసింగ్ ప్రక్రియను అవుట్‌సోర్సింగ్‌కి ఇవ్వరాదంటూ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా బ్యాంకులకు సూచించారు. రుణ వితరణ అనేది బ్యాంకు అత్యంత ప్రధాన కార్యకలాపాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. దీన్ని ప్రధానేతర అంశంగా పరిగణించరాదన్నారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా రికవరీ ప్రక్రియ చేపట్టేయాలని ముంద్రా సూచించారు.
నిరర్థక ఆస్తి ఏ రూపంలోనిదైనా బ్యాంకింగ్ వ్యవస్థకు భారంగా మారుతుందని, దీని ప్రభావం నిజాయితీగా కట్టే వారిపై పడుతుందని ఆయన చెప్పారు. ఎగవేతదారుల పనిపట్టేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటోందన్నారు.
అటు, బాండ్ల ద్వారా ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు సమీకరిస్తుండటమనేది కార్పొరేట్ డెట్ మార్కెట్ వృద్ధికి అడ్డంకిగా మారుతోందని ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్‌బీఐ మరో డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ చెప్పారు. అయితే, ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రణాళికలతో ఈ పరిస్థితిలో మార్పు రాగలదన్నారు. అటు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్)ను క్రమక్రమంగా తగ్గించే అంశం కూడా కార్పొరేట్ డెట్ మార్కెట్‌కు ప్రయోజనం చేకూర్చగలదని ఆయన తెలిపారు.