హైదరాబాద్‌పై మూడు రకాల ప్రతిపాదనలు
-
కేంద్ర హోంమంత్రి షిండే
-
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి
-
ఏపీలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదు
-
అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదు
-
సోనియా చెప్పిన ప్రభుత్వ కమిటీ గురించి నాకు తెలీదు
-
‘టీ-బిల్లు’ ఎప్పుడు పెడతామో కొద్ది కాలం వేచిచూడండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ విషయంలో రెండు, మూడు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే వెల్లడించారు. ఆ అంశాలేమిటనేది చెప్పేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదన వాటిలో ఉందా అనే విషయంపై ఈ దశలో తాము ఏమీ చెప్పలేమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ రూపొందిస్తున కేబినెట్ నోట్ ఎప్పటిలోగా సిద్ధమౌతుందన్న ప్రశ్నకు.. త్వరలోనే కేబినెట్‌కు సమర్పిస్తామని బదులిచ్చారు. తెలంగాణ బిల్లును ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెడతారన్న ప్రశ్నకు కూడా ‘వేచి చూడండి’ అని మాత్రమే బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ నెలవారీ నివేదిక విడుదల చేస్తూ షిండే శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ నిర్ణయం, ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపై తీర్మానాన్ని రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఒక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఈ అంశం ప్రభుత్వం వద్దకు రావటంతో రెండో దశ మొదలయింది’ అని షిండే పేర్కొన్నారు. విభజనకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు, శనివారం సీమాంధ్ర ప్రభుత్వోద్యోగుల భారీ బహిరంగ సభపై ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉందన్నారు. ఎన్‌జీవోల సభ సందర్భంగా చిన్నపాటి సంఘటనలు మినహా శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.
అఖిలపక్ష కమిటీ ప్రతిపాదనేదీ లేదు: విభజనతో తలెత్తే సమస్యలపై నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఏర్పాటైన ఆంటోనీ కమిటీ సిఫారసులు వచ్చిన తర్వాత ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని బదులిచ్చారు. ప్రభుత్వ స్థాయిలో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని, గతంలో అన్ని పక్షాలతో అనేకసార్లు జరిపిన చర్చల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చినందునే సీడబ్ల్యూసీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ కమిటీ గురించి తనకు తెలియదన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తాజాగా మరోసారి కేంద్ర హోంమంత్రికి లేఖ రాయటం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీమాంధ్ర ప్రాంతంలో యాత్ర నిర్వహిస్తుండటం గురించి ప్రస్తావించగా.. మొదట్లో రెండు పార్టీలు, తర్వాత కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) మినహా అన్నీ తెలంగాణ డిమాండ్‌ను సమర్థించాయని.. నిర్ణయం జరిగిన తర్వాత ఏ పార్టీ అయినా తమ వైఖరిని మార్చుకుంటే తానేం చేయగలనని షిండే వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల మధ్య పెరుగుతున్న విద్వేషాలకు ఎప్పుడు తెరదించుతారని ప్రశ్నించగా.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, హోంశాఖ నివేదిక కేంద్ర మంత్రివర్గానికి చేరిన తర్వాత ఈ సమస్యలన్నింటిపై దృష్టి సారిస్తామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పలేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఆ మూడు ప్రత్యామ్నాయాలివే..!
కేబినెట్ నోట్‌లో కేంద్ర హోంశాఖ హైదరాబాద్‌పై కింది 3 ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది. ఈ మూడు ప్రత్యామ్నాయాలూ హోంశాఖ కేంద్రానికి చేయబోయే సూచనలు మాత్రమే. దీనిపై.. త్వరలో మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) తుది నిర్ణయం తీసుకుంటుంది. అవేమిటంటే...
1. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించటం
2. కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం
3. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణను (పోలీసింగ్‌ను) ఢిల్లీ తరహాలో కేంద్ర హోంశాఖ నియంత్రణలోకి తీసుకురావటం