ఇటు దసరా శోభ.. అటు దగాపడ్డ క్షోభ | Cabinet green signal for Telangana formation | Sakshi
Sakshi News home page

ఇటు దసరా శోభ.. అటు దగాపడ్డ క్షోభ

Published Fri, Oct 4 2013 1:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఇటు దసరా శోభ.. అటు దగాపడ్డ క్షోభ - Sakshi

ఇటు దసరా శోభ.. అటు దగాపడ్డ క్షోభ

తెలంగాణకు రాజముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్‌ రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రతిపాదించిన కేబినెట్‌ నోట్‌ను గురువారం ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన మంత్రవర్గ సమావేశం ఆమోదించింది. తద్వారా రాష్ట్ర విభజనకు, దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు అధికారికంగా కేంద్రం శ్రీకారం చుట్టింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికీ పదేళ్ల పాటు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం ఆమోదించింది. విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు 9 మంది మంత్రులతో కూడిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు అవసరమైన చట్ట, పాలనాపరమైన యంత్రాంగం రూపకల్పనతో పాటు నదీజలాలు, జల వనరులు, విద్యుత్‌ పంపిణీ వంటి విభజనతో ఉత్పన్నమయ్యే అన్ని అంశాలు, సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, వాటికి పరిష్కార మార్గాలు చూపడమే గాక సమైక్య రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజల భద్రత, రక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను జీఓఎంకు అప్పగించారు.
 
అలాగే విభజన అనంతరం కోస్తాంధ్ర, రాయలసీమలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం ఆర్థికంగా ఎలాంటి సహాయాన్ని, ఎంతమేరకు అందజేయాలన్న అంశాన్ని కూడా జీఓఎం చూస్తుంది. రెండు రాష్ట్రాల్లోని వెనకబడ్డ ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవసరాలను తీర్చడంతో పాటు వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కూడా సిఫార్సు చేస్తుంది. వీటితో పాటు విభజన ప్రక్రియలో భాగంగా మున్ముందు తలెత్తే అన్ని అంశాలనూ అది పరిశీలిస్తుంది. అనంతరం కేంద్రానికి సమగ్ర నివేదికను జీఓఎం సమర్పిస్తుంది. అంతేగాక ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన సమగ్రమైన బిల్లును కూడా అదే తయారు చేస్తుంది. దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక రాష్టప్రతికి పంపుతారు. అనంతరం బిల్లును ఆయన అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపుతారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక దాన్ని రాష్టప్రతి తన ఆమోదంతో పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఆమోదించి, దానిపై రాష్టప్రతి ఆమోద ముద్ర కూడా పడగానే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుంది. మొత్తంమీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) చేసిన తీర్మానానికి దాదాపుగా నకలు మాదిరిగానే కేబినెట్‌ నోట్‌ తయారైంది.
 
అయితే గురువారం నాటి కేబినెట్‌ నోట్‌ను సంప్రదాయానికి విరుద్ధంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఆమోదించడం విశేషం. నిజానికి నోట్‌ను ముందుగా అసెంబ్లీకి పంపుతామని గతంలో కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ప్రకటించడం తెలిసిందే. కానీ అలా అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండానే నేరుగా బిల్లును తయారు చేసి రాష్టప్రతికి నివేదించాలని నిర్ణయించారు. కేబినెట్‌ నిర్ణయాన్ని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, ఎంఎం పళ్లంరాజు భేటీలోనే వ్యతిరేకించారని, తెలంగాణకు చెందిన మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి గట్టిగా సమర్థించారని సమాచారం. శరద్‌పవార్‌, అజిత్‌సింగ్‌ తెలంగాణ ఏర్పాటును సమర్థించారని సమాచారం. మిగతా మం త్రుల్లో కూడా చాలామంది సీమాంధ్రలో ఉద్యమం నడుస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూనే, మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదని అన్నారని తెలిసింది. చివరగా ప్రధాని మాట్లాడుతూ, ఏ ప్రాంతానికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదంటూ హామీ ఇచ్చినట్టు సమాచారం.
 
‘‘చాలామందిలో అభ్యంతరాలు, ఆందోళనలుండటం నిజమే. వాటన్నింటినీ జీఓఎం చూసుకుంటుంది. దాని విధి విధానాలను కూడా చాలా కచ్చితంగా నిర్ధారించాం’’ అంటూ ఆయన చెప్పినట్టు తెలిసింది. జీఓఎంకు ఆరు వారాల కాల వ్యవధి ఇచ్చినట్టు సమాచారం. పార్లమెంటు శీతాకల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని మాత్రం కేబినెట్‌ నిర్ణయించిందని తెలిసింది. ఆ సమావేశాలు నవంబర్‌ 20-23 తేదీల మధ్య ప్రారంభమయేలా ఉన్నం దున జీఓఎం పరిశీలన, నివేదిక, బిల్లు తయారీ ఆలోగా పూర్తి కావాల్సి ఉంటుంది. నివేదిక, బిల్లు తయారీకి జీఓఎంకు ఆరు వారాల గడువును మంత్రివర్గం ఇచ్చిం దంటూ వస్తున్న వార్తలు దీన్ని బలపరుస్తున్నాయి. మరోవైపు, సీమాంధ్రకు చెందిన మరో కేబినెట్‌ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ తల్లి గురువారమే మరణించారు. దాంతో ఆయన మంత్రివర్గ సమావేశానికి వెళ్లలేకపోయారు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన రాయల తెలంగాణపై సాగిన ఊహాగానాలకు కేబినెట్‌ తాజా నిర్ణయంతో తెర పడింది.
 
ఆంటోనీ కమిటీ ఊసు లేకుండానే...
సీమాంధ్రుల్లో తలెత్తిన ఆందోళనలను, వారి అభ్యంతరాలను పరిష్కరించేందుకంటూ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీతో నిమిత్తం లేకుండానే నోట్‌ ఆమోదం, జీఓఎం ఏర్పాటు చకచకా జరిగిపోవడం విశేషం! అయితే కమిటీని సలహాలు, సూచనల కోసం జీఓఎం పిలిచి చర్చిస్తుందని చెబుతున్నారు. మరోవైపు నోట్‌ను కేబినెట్‌ ముందు పెట్టేముందు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అంగీకారాన్ని షిండే తీసుకున్నట్టు తెలుస్తోంది. కళంకిత ప్రజాప్రతినిధులను కాపాడేందుకు రూపొందించిన ఆర్డినెన్‌‌స వ్యవహారంలో రాహుల్‌ చేతిలో ప్రధానికి ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా ఆయన ఈ జాగ్రత్త తీసుకున్నట్టు చెబుతున్నారు! కేబినెట్‌ నిర్ణయంతో విభేదించే అసంతృప్తవాదులెవరైనా పార్టీని వీడవచ్చంటూ అధిష్టానం కుండబద్దలు కొట్టినట్టూ తెలుస్తోంది. అయితే, ఇది రాహుల్‌ నిర్ణయమేనని చెప్పడంద్వారా సీమాంధ్ర మంత్రుల నోటికి ముందుగానే తాళం వేసిందంటున్నారు.
 
సహకరించండి: దిగ్విజయ్‌
 
తెలంగాణ, సీమాంధ్రల్లోని కాంగ్రెస్‌ నేతలందరూ పార్టీ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయానికి సహకరించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ కోరారు. ‘‘ఆంటోనీ కమిటీ కూడా జీఓఎంకు తన నివేదికను అందజేస్తుంది. తెలంగాణ, సీమాంధ్రల్లోని అందరు నేతలనూ సంప్రదించిన మీదటే అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దానికి సహకరించాల్సిందిగా సీమాంధ్ర ఎంపీలకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు. టేబుల్‌ ఐటంగా...
 
ముందస్తుగా మంత్రులందరికీ పంపిన ఎజెండాలో భాగంగా కాకుండా, గురువారం సాయంత్రమే టేబుల్‌ ఐటం కింద తెలంగాణ నోట్‌ అంశాన్ని మంత్రివర్గంలో చర్చకు తీసుకున్నారు. అయితే, అసలు ఎజెండాను పూర్తిగా పక్కన పెట్టి ముందు తెలంగాణ అంశాన్నే మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది! సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.15 దాకా దాదాపు గంటా 45 నిమిషాల పాటు మల్లగుల్లాలు పడింది. నోట్‌ వివరాలను, తెలంగాణ డిమాండ్‌ పూర్వాపరాలను హోం మంత్రి షిండే కేబినెట్‌కు వివరించారు. ‘‘తెలంగాణ డిమాండ్‌ 50 ఏళ్లుగా ఉంది. చాలాసార్లు దీనిపై పలు నిర్ణయాలు కూడా జరిగాయి. చివరికి తెలంగాణ ఏర్పాటుకు 2009 డిసెంబర్‌ 9న కేంద్రం నిర్ణయం కూడా ప్రకటించింది. కానీ తర్వాతి పరిణామాల దృష్ట్యా శ్రీకృష్ణ కమిటీ వేయడం, అది అందరితో లోతుగా చర్చించి, రాష్టమ్రంతా పర్యటించి నివేదిక ఇవ్వడం జరిగింది. దానిపైనా ఏకాభిప్రాయం రాకపోవడంతో తర్వాత రెండుసార్లు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాం’’ అంటూ పూర్వాపరాలను ఏకరువు పెట్టారు. విభజన యోచనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించిందని కూడా ఈ సందర్భంగా షిండే చెప్పినట్టు తెలిసింది! తెలంగాణకు దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చింది కాబట్టి రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్‌కు ప్రతిపాదిస్తున్నామన్నారు. జీఓఎంలో కేంద్ర హోం, ఆర్థిక, న్యాయ, జల వనరులు, విద్యుత్‌, ఇంధన వనరులు, వైద్య-ఆరోగ్య తదితర శాఖల మంత్రులుంటారు.
 
వ్యతిరేకించిన కావూరి, పళ్లంరాజు
కేబినెట్‌ నోట్‌పై ముందుగా కావూరి దాదాపు 25 నిమిషాలు మాట్లాడారు. కేంద్రం తొందరపడి విభజన నిర్ణయం తీసుకుంటోందని ఆయన అన్నట్టు తెలిసింది. ‘‘నేను ఇన్ని దశాబ్దాలుగా నిబద్ధతతో కాంగ్రెస్‌లోనే ఉన్నాను. కాబట్టి పార్టీ నుంచి నేను బయటికి వెళ్లకపోవచ్చు. కానీ ఈ నిర్ణయం, ప్రతిపాదన నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. దీనితో ఏకీభవించలేను, ఆమోదించలేను. నన్ను క్షమించండి’’ అన్నారని సమాచారం. పళ్లంరాజు కూడా ఇదే వాదన విన్పించారు. తర్వాత తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా జైపాల్‌ అరగంట పాటు మాట్లాడారు. ఇది ఎప్పుడో 2009లోనే జరిగిపోయిన నిర్ణయమని మరో మంత్రి జైరాం రమేశ్‌ అన్నారు. ‘‘దీనిపై ఇప్పుడు మంత్రివర్గంలో ఇంత చర్చ అనవసరం.
 
 నిర్ణయం అమలులో జాప్యం జరిగిన కొద్దీ సీమాంధ్రలో ఉద్యమం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు’’ అన్నట్టు తెలిసింది. ఇదేమీ కొత్త విషయం కాదని, తెలంగాణ డిమాండ్‌ వాస్తవికమైనది కాబట్టి దాన్ని అమలు చేయడం మాత్రమే ప్రస్తుతం చేయగలిగిన పని అని శరద్‌ పవార్‌ అన్నారు. అలాగైతే మహారాష్ట్ర నుంచి విదర్భను కూడా విడదీస్తారా అని పళ్లంరాజు, కావూరి ప్రశ్నించగా, ‘‘ఆ పరిస్థితి వస్తే దాన్ని మేం హాండిల్‌ చేస్తాం’’ అని పవార్‌ బదులిచ్చారు. ఉత్తరప్రదేశ్‌ను కూడా విభజించి హరితప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని అజిత్‌సింగ్‌ కోరినట్టు సమాచారం. పార్టీ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నానంటూ ఆర్థిక మంత్రి చిదంబరం ఏకవాక్యంతో సరిపెట్టారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement