20 రోజుల్లో కేబినెట్‌కు నోట్ - తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై షిండే
20 రోజుల్లో కేబినెట్‌కు నోట్ - తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై షిండే
Published Tue, Sep 3 2013 2:36 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నెల రోజులుగా సమైక్యోద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోం శాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నట్టు సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో తనను కలసిన విలేకరులకు ఆయన స్పష్టం చేశారు. అది మరో 20 రోజుల్లో మంత్రివర్గం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామన్నారు. ‘‘మంత్రివర్గ ఆమోదం కోసం నోట్ తయారవుతోంది. సిద్ధమయ్యాక దాన్ని కేంద్ర న్యాయ శాఖ ఆమోదానికి పంపిస్తాం. న్యాయ శాఖ ఆమోదించాక 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పిస్తాం’’ అని తెలియజేశారు. నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యమూ జరగడం లేదని ఒక ప్రశ్నకు బదులుగా షిండే చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీల నిర్ణయాన్ని అమలు చేయడానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నోట్‌ను రూపొందించడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ దృష్టితోనే హోం శాఖ ఆచితూచి వ్యవహరిస్తోందని వివరించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కొనసాగింపుగా రాష్ట్రంలోని పార్టీలతో, ప్రజాసంఘాల ప్రతినిధులతో జరిపిన విసృ్తత సంప్రదింపులు, పార్టీల లిఖితపూర్వక అభిప్రాయాల ప్రాతిపదికన రాష్ట్ర విభజనను సూచిస్తూ హోం శాఖ నివేదిక సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ‘‘ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం తీర్మానించనుంది. ఆ వెంటనే రాష్ట్ర విభజనతో ఉత్పన్నం కాగల కీలక సమస్యల అధ్యయనానికి కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని (జీఓఎం) ఏర్పాటు చేస్తూ, విభజనపై చర్చించి అభిప్రాయాలు తెలపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదిస్తుంది’’ అని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
విభ జనపై అసెంబ్లీ నిర్ణయం, అభిప్రాయం ఎలా ఉన్నా కేంద్రం మాత్రం తన నిర్ణయంతో ముందుకెళ్తుందని స్పష్టం చేశాయి. విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలించి, సీమాంధ్రుల భయాందోళనలను తొలగించేందుకు ఏర్పాటైన కాంగ్రెస్ కమిటీ సారథి ఏకే ఆంటోనీయే కేంద్ర మంత్రుల ఉప సంఘానికీ చైర్మన్‌గా ఉండవచ్చని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీతో పాటు షిండే, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, మానవ వనరుల మంత్రి పళ్లంరాజు (రాజీనామా చేయకపోతే) కూడా ప్రభుత్వ కమిటీలో ఉండవచ్చని అధికార వర్గాల సమాచారం. సీమాంధ్ర ప్రజలను సంతృప్తిపరిచే ప్రయత్నంలో భాగంగా విభ జన సమస్యల పరిశీలనకు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ వేస్తామన్న ప్రభుత్వ కమిటీ ఇదే కావచ్చంటున్నారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామా వ్యూహం
తమ అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేస్తుండడంతో తీవ్ర నిరాశ, నిసృ్పహలకు లోనవుతున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కూడా విభజన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిన మరుక్షణమే మంత్రివర్గం నుండి వైదొలగాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. సోమవారం షిండే ప్రకటన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వారంతా సమావేశమయ్యారు. పదవులను త్యజించాల్సిన ముహూర్తంపైనే చ ర్చించినట్టు సమాచారం. మంగళవారం ఆంటోనీ కమిటీతో భేటీలో ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఆగస్టు 5న అవి ప్రారంభమైనప్పటి నుంచీ సీమాంధ్ర ఎంపీలు స్తంభింపజేస్తుండటం, ఇప్పటికే ఐదేసి రోజుల చొప్పున రెండుసార్లు సస్పెన్షన్‌కు గురవడం తెలిసిందే.
కిరణ్, బొత్సలకూ పిలుపు
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలను మంగళవారం రాత్రి ఏడింటికి గురుద్వారా రకబ్‌గంజ్ రోడ్‌లోని కాంగ్రెస్ వార్ రూమ్‌లో సమావేశానికి ఆంటోనీ కమిటీ ఆహ్వానించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో కూడా రేపే కమిటీ విడిగా భేటీ కానుంది. ఆదివారం రాత్రి హస్తిన చేరిన బొత్స కూడా దీన్ని ధ్రువీకరించారు.
Advertisement
Advertisement