రైలు ప్రయాణికులకు శుభవార్త
ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నవారికి సర్‌చార్జి ఏమీ పడట్లేదు. తొలుత మార్చి నెలాఖరు వరకే ఉన్న ఈ అవకాశాన్ని ఇప్పుడు జూన్ 30 వరకు పొడిగించారు. దీన్ని కనీసం జూన్ నెలాఖరు వరకు పొడిగించాలని తమకు సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి సూచనలు వచ్చినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
గత నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత ఆన్‌లైన్, డిజిటల్ బుకింగ్‌ను ప్రోత్సహించేందుకు రైలు టికెట్లపై సర్‌చార్జిని ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో కేవలం టికెట్ ధర తప్ప, అదనంగా ఎలాంటి వడ్డింపులు లేకుండా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇప్పుడు మరో మరో మూడు నెలల పాటు అమలులో ఉంటుందన్న మాట. నవంబర్ 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సర్వీసు చార్జి, దాని మీద సర్వీసు టాక్స్ రూపంలో రైల్వేశాఖ రూ. 184 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ విషయాన్ని రైల్వే ప్రతినిధులు తెలిపారు.