ఆంటోనీ కమిటీకి కాలపరిమితి లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్న విభేదాలు, సీమాంధ్ర ప్రాంత నేతల ఆందోళనలను పరిశీలించటానికి.. రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని నేతృత్వంలో పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ సోమవారం నుంచి పని ప్రారంభిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. అయితే.. ఈ కమిటీకి ఎలాంటి కాల పరిమితీ లేదని స్పష్టంచేశారు. దిగ్విజయ్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో తనను కలిసిన కొందరు మీడియా చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక సమస్యలను లేవనెత్తారు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘విభజన అంశంపై సోనియాగాంధీ నియమించిన ఆంటోని కమిటీ వచ్చే సోమవారం నుంచి పని మొదలుపెడుతుంది. సీఎం వ్యక్తంచేసిన సందేహాలను పరిశీలిస్తుంది. ఎవరెవరి వాదనలు తీసుకోవాలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులను జాబితా అడిగి తీసుకుంటుంది. అన్ని వర్గాల ప్రజల నుంచి విజ్ఞాపనలను పరిశీలిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే సమస్యలనూ కమిటీ ముందుగానే పరిశీలిస్తుంది.
వాటన్నింటినీ కేంద్రం దృష్టికి తెస్తుంది. సమస్యను పరిష్కరించే దిశగా సూచన చేస్తుంది’’ అని ఆయన బదులిచ్చారు. ‘కమిటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందా లేక ఢిల్లీ నుంచే పనిచేస్తుందా?’ అన్న ప్రశ్నకు.. ‘‘అక్కడికి (హైదరాబాద్‌కు) వెళ్లవచ్చు.. లేదా ఇక్కడి నుంచే (ఢిల్లీ నుంచే) చేయవచ్చు. నిజానికి ప్రస్తుతం ఆంటోని పార్లమెంట్ సమావేశాల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఆయన వీలునుబట్టి ఎక్కడ వాదనలు వినాలో నిర్ణయిస్తాం’’ అని సమాధానం చెప్పారు. ‘కమిటీకి కాలపరిమితి ఉందా?’ అని అడగ్గా ఎలాంటి కాలపరిమితి లేదని దిగ్విజయ్ స్పష్టంచేశారు. ‘కమిటీకి, తెలంగాణ ఏర్పాటుకు సంబంధం ఉందా?’ అని ప్రశ్నించగా.. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలపై దృష్టి సారించి.. వాటిని పరిష్కరించటమే కమిటీ లక్ష్యం. అందువల్ల రాష్ట్ర విభజనకు, కమిటీకి సంబంధం ఉంది’’ అని బదులిచ్చారు.