రాజుకుంటున్నకొరియా కొలిమి! | North Korea preparing for another missile test | Sakshi
Sakshi News home page

రాజుకుంటున్నకొరియా కొలిమి!

Published Wed, Sep 6 2017 2:00 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

రాజుకుంటున్నకొరియా కొలిమి! - Sakshi

రాజుకుంటున్నకొరియా కొలిమి!

మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా!

‘క్షిపణి, అణ్వాయుధ పరీక్షలతో కవ్వింపు చర్యలకు దిగొద్దని ఎంత చెప్పినా వినకుండా ‘ధూర్తదేశం’ యుద్ధానికి రమ్మంటూ అడుక్కుంటోంది’ అంటూ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీ హేలీ ఉత్తర కొరియాకు చేసిన హెచ్చరిక పనిచేయడం లేదు. తాజాగా ఉత్తర కొరియా తన పశ్చిమ తీరానికి ఖండాంతర క్షిపణిలా కనిపిస్తున్న రాకెట్‌ను తరలించినట్టు దక్షిణ కొరియా తెలిపింది. దీనిని ఎప్పుడు పరీక్షిస్తారనే సమాచారం తమవద్ద లేదంది. ఉత్తర కొరియా ఆదివారం ఆరో అణు పరీక్ష జరపడం అమెరికా ఆగ్రహానికి కారణమైంది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో అణుయుద్ధానికి కిమ్‌ ఏ క్షణాన్నైనా తెరలేపవచ్చనే భయాందోళనలు ప్రపంచదేశాలను చుట్టుముడుతున్నాయి.

కిమ్‌ బెదిరిస్తున్నట్టుగా అమెరికా భూభాగాన్నిగాని, మిత్రదేశాలనుగాని లక్ష్యంగా చేసుకుని ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగిస్తే భారీ సైనిక స్పందన తప్పదని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ హెచ్చరించారు. కిమ్‌ ఆగడాలకు అమెరికా ప్రతిచర్య క్రూరంగా ఉంటుందని ఆ దేశ ఆర్మీ రిటైర్డ్‌ జనరల్‌ అన్నారు. అగ్రరాజ్య నేతలు ఇలా తీవ్రపదజాలంతో కిమ్‌ను దారిలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు.

దక్షిణ కొరియా పక్కలో బల్లెం కమ్యూనిస్ట్‌ కొరియా!
ఉత్తర కొరియా ఎంతగా కవ్విస్తున్నా లిబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా సాయుధ దాడికి అమెరికా దిగటం లేదు. ఇందుకు ప్రధాన కారణం మిత్రదేశం దక్షిణ కొరియాపై కిమ్‌ ప్రభుత్వం ఎక్కుపెట్టిన మారణాయుధాలే. దాయాది దేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా తన సరిహద్దుల్లో నిలిపిన భారీ ఫిరంగులు, రాకెట్లు ఇతర దూరశ్రేణి ఆయుధాలే అమెరికాకు అడ్డంకిగా మారాయి. అగ్రరాజ్యం దాడికి దిగిన వెంటనే కిమ్‌ ఈ ఆయుధాలను ప్రయోగిస్తే రెండు కోట్ల 50 లక్షల జనాభా ఉన్న సియోల్‌ వల్లకాడుగా మారుతుంది. పౌరులు అంచనావేయలేనంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారు. కిమ్‌ దేశంపై ప్రతీకార దాడి చేయడానికి అమెరికా ఈ కారణంగానే వెనుకాడుతోందని నిపుణులు చెబుతున్నారు.  
                                                                                                            

యుద్ధం సాధ్యమేనా?
అమెరికా అండతో ఆర్థికశక్తిగా ఎదిగిన దక్షిణ కొరియాకు ఆయుధాల సరఫరా ఆపి, ఏటా చేస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలకు స్వస్తి పలకాలనేది ఉత్తర కొరియా డిమాండ్‌. క్షిపణి, అణు పరీక్షల ద్వారా అమెరికాను తన డిమాండ్లకు ఒప్పుకునేలా చేయడమే కిమ్‌ వ్యూహం. ఒకవేళ అమెరికా నాయకత్వాన దక్షిణ కొరియా, జపాన్‌లు కిమ్‌ రాజ్యంపై యుద్ధం ప్రారంభిస్తే భారత్‌ సహా దక్షిణాసియా దేశాలకు ఆర్థికంగా నష్టం తప్పదు. అనేక శక్తిమంతమైన దేశాలతో ఉత్తర కొరియాకు వాణిజ్య సంబంధాలున్నాయి. కొరియా ద్వీపకల్పంలో యుద్ధానికి దిగి విజయం సాధించి, కిమ్‌ సర్కారును కూల్చే స్థితిలో అమెరికా లేదు.

యుద్ధమే వస్తే దక్షిణ కొరియాలో ఉన్న సేనలు, ఆయుధాలు అమెరికా దాడి చేయడానికి సరిపోవు. అదనపు బలగాలు, ఆయుధాలు, యుద్ధ సామగ్రిని దక్షిణ కొరియాకు తరలించడానికి వారాలు, నెలలు పడుతుంది. అమెరికా చేసే తొలి దాడికి బీ2, బీ–52, ఎఫ్‌–22 స్టెల్త్‌ ఫైటర్‌ విమానాలు అవసరమౌతాయి. గ్వామ్‌లోని అమెరికా వైమానిక స్థావరం నుంచి ఈ తరహా విమానాలతో దాడులు చేయాల్సి ఉంటుంది. ‘‘వారం క్రితంతో పోల్చితే యుద్ధానికి ఇప్పుడు దగ్గరగా లేము. పదేళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే మాత్రం ఉత్తర కొరియాతో పోరుకు సమీపంలో ఉన్నామని చెప్పగలం’’ అని అమెరికా సీఐఏ డైరెక్టర్‌ మైక్‌ పాంపియో, ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ఆర్‌ మెకాస్టర్‌లు మీడియాకు చెప్పిన మాటలద్వారా తక్షణం యుద్ధప్రమాదం లేదని అనుకోవచ్చు.   

                                                                                                                         – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement