శత విధాలుగా యత్నిస్తున్న కిమ్..
సియోల్: ఉత్తర కొరియా తీరుతో ఏ క్షణం ఏం జరగుతుందోనని ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. జపాన్‌కైతే కిమ్ రాజ్య ప్రవర్తన అసలు నచ్చడం లేదు. సోమవారం మరోమారు క్షిపణి పరీక్ష చేసింది ఉత్తర కొరియా. జపాన్ జలాల వైపు ప్రయాణించిన క్షిపణి ఆ దేశ మారిటైమ్ సెజ్‌లో కూలిపోయింది.
ఈ మేరకు దక్షిణ కొరియా, జపాన్ అధికారులు విడివిడిగా ప్రకటనలు విడుదల చేశారు. అమెరికాపై అణుదాడి చేస్తామని పదేపదే హెచ్చరిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. ఆ దేశాన్ని చేరగలిగే లాంగ్ రేంజ్ మిస్సైల్ కోసం విస్తృత పరిశోధనలు చేయిస్తున్నాడు. అణు సామర్ధ్యం కలిగిన క్షిపణిని తయారు చేసేందుకు ఉత్తరకొరియా పరిశోధకులు శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో గత ఆదివారం చేసిన ప్రయోగంతో మీడియం రేంజ్ మిస్సైల్స్ సామర్ధ్యం ఉన్ రాజ్య సొంతమైంది. తాజా ప్రయోగించిన క్షిపణి 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీనిపై స్పందించిన జపాన్ తమ మారిటైమ్ ఎకనమిక్ జోన్‌లో క్షిపణి పడినట్లు ధ్రువీకరించింది. ఈ ఘటనలో ఓడలకు, విమానాలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని తెలిపింది.