![North Korea Kim Jong Un Tests Banned Intercontinental Missile - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/24/Kim_Jong_Un_Missile_test.jpg.webp?itok=tj8Wychf)
ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడితే.. ఉత్తర కొరియా మాత్రం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. చివరికి తిండి దొరక్కపోవడంతో తినడం తగ్గించాలంటూ దేశ ప్రజలకు ఆ దేశ నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక సందేశం ఇచ్చాడంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన సంబురాల్లో మునిగిపోయాడు. చిందులేశాడు. అందుకు కారణం జనాల సంతోషం ఏమాత్రం కాదు.
ఆర్థిక సంక్షోభం ఏమాత్రం పట్టన్నట్లు.. ఉత్తర కొరియా ఈమధ్యకాలంలో వరుసగా ఆయుధ పరీక్షలు చేపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళలోనూ.. నార్త్ కొరియా మాత్రం తన ఆయుధ సంపత్తికి మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించిందని, అందుకే కిమ్ అంత సంతోషంగా ఉన్నాడని కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఒక ప్రకటన వెలువరించగా.. జపాన్ సైతం ఈ మిస్సైల్ టెస్ట్‌ను నిర్ధారించింది.
ఎక్కడి నుంచి ప్రయోగించిందో అనే సమాచారం లేదు. కానీ, సదరు ఖండాతర క్షిపణి సుమారు 1,100 కిలోమీటర్లు, గంటకు పైగా ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో పడిపోయిందని తెలుస్తోంది. ఈ క్షిపణి ప్రయోగానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. నిషేధిత ఖండాంతర క్షిపణిని 2017 తర్వాత ఉత్తర కొరియా ఇప్పుడే ప్రయోగించింది. అది సక్సెస్ కావడంతోనే కిమ్ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మునుపెన్నడూ చూడని జోష్‌తో ఆయన అంతా కలియదిరిగారట. పైగా ఈ నెల 16వ తేదీన ఉత్తర కొరియా ఒక భారీ క్షిపణిని ప్రయోగించగా, అది రాజధాని ప్యాంగ్ యాంగ్ గగనతలంలోనే పేలిపోయి తునాతునకలైంది. ఈ ఫెయిల్యూర్‌ను అధిగమించేలా.. ప్రస్తుత క్షిపణి సక్సెస్ కావడంతో అధికార వర్గాలు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి.
కిమ్ మాట తప్పాడు
లాంగ్ రేంజి మిస్సైళ్లను పరీక్షంచబోమని, అణు పరీక్షలు జరపబోమని 2018లో కిమ్ జాంగ్ ఉన్ మారటోరియం విధించుకున్నారు. అయితే అది 2020లో పటాపంచలైంది. మారటోరియంను తాము ఎక్కువకాలం అమలు చేయలేమని స్పష్టం చేసిన ఉత్తరకొరియా అధినేత మళ్లీ అమెరికాకు, ప్రపంచదేశాలకు సవాళ్లు విసరడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి నిషేధిత జాబితాలో ఉందని, తద్వారా కిమ్ జోంగ్-ఉన్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాటను తప్పాడని విమర్శిస్తోంది దక్షిణ కొరియా.
ఇంతకు మించే..
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా హాసంగ్-14 లాంగ్ రేంజి క్షిపణులను రూపొందించింది. ఇవి 8,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు. వీటి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. కానీ, ఈ తరహా భూతల క్షిపణులు కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అయితే ఇంతకు మించిన రాక్షస మిస్సైల్‌ను 2017లోనే ఉత్తర కొరియా ప్రయోగించింది. సుమారు 13,000 కిలోమీటర్లకు పైగా రేంజ్‌లో ప్రయాణించగల ఆ మిస్సైల్స్ గనుక ప్రయోగిస్తే గురి తప్పకుండా అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్థ్యం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment