‘నోటా’పై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో నోటాకు స్థానం కల్పించని వ్యవహారంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు పిటిషనర్‌కు తేల్చిచెప్పింది. అంతేకాక తదుపరి వచ్చే ప్రతీ ఎన్నికలో నోటాకు తప్పనిసరిగా స్థానం కల్పించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించేందుకు సైతం హైకోర్టు అంగీకరించలేదు. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలు ముగిసినందున ఈ వ్యాజ్యంలో విచారించడానికి ఏమీ లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఎన్నికలు ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించి నోటా ఉత్తర్వులు పొందవచ్చునని, ఎన్నికలు లేని సమయంలో తాము ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
నోటాకు స్థానం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎన్నికల సంఘం, గ్రేటర్ ఎన్నికల్లో పట్టించుకోలేదని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో నోటాకు స్థానం కల్పించేటట్లు ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన లుబ్నాసార్వత్ హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.