'నోటా గుర్తింపు చిహ్నం కేటాయించండి'
హైదరాబాద్ : ఈవీఎంలో నోటా గుర్తింపు చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్కు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈవీఎంలో నోటా గుర్తింపు చిహ్నంపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. చదువుకోలేనివారు ఇంగ్లీష్ వాక్యాలను ఎలా గుర్తిస్తారని హైకోర్టు ఈ సందర్భంగా ఈసీని ప్రశ్నించింది. అందరు గుర్తుపట్టే విధంగా నోటాపై చిహ్నం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.
కాగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జాతీయ ఎన్నికల సంఘం ఈసారి కొత్తగా నోట (నన్ ఆఫ్ ది అబవ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో 'నోటా' (పైవారు ఎవరూ కాదు) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకుంటే ఓటర్లకు తిరస్కరించే హక్కును (ఈవీఎంలలో నన్ ఆఫ్ ద ఎబవ్ ఆప్షన్- పైన పేర్కొన్న అభ్యర్థులు ఎవరూ కాదు) కల్పించిన కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా దీన్ని ఇటీవలి జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసింది. నోటా చిహ్నం దీర్ఘ చతురస్రాకారంలో ‘నన్ ఆఫ్ ద ఎబోవ్ (నోటా)’ అని ఆంగ్లంలో పెద్ద అక్షరాలతో ముద్రించి ఉంటుంది.
కాగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం) బ్యాలెట్ యూనిట్‌పై ఉండే ఏదో ఒక మీటను నొక్కి నచ్చిన అభ్యర్థికి ఓటేయడమే ఇప్పటి వరకు ఓటర్లకు తెలుసు. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలతో తొలిసారిగా అమలవుతున్న తిరస్కరణ ఓటు, ఓటు రసీదుపై ఓటర్లకు విస్తృతంగా ప్రచారం కల్పించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.