
పిజ్జా తరహాలో సిలిండర్ డెలివరీ
‘డయల్ ఏ మినీ ఎల్‌పీజీ’ ప్రారంభం
న్యూఢిల్లీ: పిజ్జా మాదిరిగానే ఒక్క ఫోన్ కాల్‌తో గ్యాస్ సిలిండర్ నేరుగా మీ ఇంటికే రానుంది. ఐదు కేజీల మినీ ఎల్‌పీజీ సిలిండర్‌ను ఫోన్ చేసి బుక్ చేసుకునే ‘డయల్ ఏ మినీ ఎల్‌పీజీ’ సౌకర్యాన్ని పెట్రోలియం శాఖ అందుకి బాటులోతెచ్చింది. 1800-22-4344 (అన్ని నగరాలకూ) నంబర్‌కు ఫోన్ చేస్తే.. ఐదు కేజీల సిలిండర్ నేరుగా మీ ఇంటికే వస్తుంది.
ఇదే నంబర్‌కు ఫోన్ చేసి కొత్త కనెక్షన్ సైతం తీసుకోవచ్చు. ఈ సర్వీసును తొలిసారిగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్‌ల్లో బుధవారం ప్రారంభించింది. ఎన్నికల కోడ్ కొద్ది గంటల్లో అమలులోకి వస్తుందనగా ఈ పథకాన్ని ప్రారంభించడం గమనార్హం. మినీ సిలిండర్ ధర రూ. 543. కనెక్షన్ కోసం రూ. వెయ్యి చెల్లించాలి. విడతల వారీగా దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో పెట్రోలియం మంత్రి మొయిలీ పలు అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. బుధవారం మొయిలీ కర్ణాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉంది.