రాముడు, సీత, రావణుడు.. అంతా ఒకటే పార్టీ!
రామాయణంలో సీతారాములు ఇద్దరూ ఒక చోట ఉంటారు కానీ, వాళ్లతో కలిసి రావణుడు ఉండటం ఎప్పుడైనా చూశారా? పురాణాలతో పాటు సినిమాల్లో కూడా ఎక్కడా అలా జరగదు కానీ.. రామానంద్ సాగర్ తీసిన సూపర్ హిట్ టీవీ సీరియల్ రామాయణంలోని రాముడు, సీత, రావణాసురుడు పాత్రధారులు ముగ్గురూ ఇప్పుడు ఒకటే పార్టీ.. బీజేపీలో ఉండబోతున్నారు. రావణాసురుడి పాత్ర ధరించిన అరవింద్ త్రివేదీ ఇప్పటికే బీజేపీ సభ్యుడు. ఆయన గుజరాత్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే సీత పాత్రధారిణి దీపికా చికాలియా కూడా రెండుసార్లు బీజేపీ తరఫున గుజరాత్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇక ఇప్పుడు తాజాగా.. రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ సైతం బీజేపీలో చేరుతున్నారు. మహాభారతంలో ధర్మరాజు పాత్ర పోషించిన గజేంద్ర చౌహాన్ కూడా ఇప్పటికే బీజేపీ సభ్యుడు. ఆయన ప్రస్తుతం పుణె ఫిలిం ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఉన్నారు. బీహార్ లేదా యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందు అరుణ్ గోవిల్ బీజేపీలో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానాలు వచ్చినా.. అరుణ్ గోవిల్ తిరస్కరించారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావడంతో పాటు.. బీజేపీలోనే చేరుతానని కూడా చెబుతున్నారు.