సాక్షి, నేషనల్ డెస్క్ : రఘుకులసోముడైన జగదభిరామునికి బెంజ్ కారేమిటా అనుకుంటున్నారా? ఇది జగదేక చక్రవర్తి శ్రీరాముడి గురించి కాదు. టీవీ రామాయణంలో రాముని పాత్రధారి అరుణ్ గోవిల్ గురించి! 80వ దశకంలో దూరదర్శన్‌లో వచ్చిన రామాయణం సీరియల్‌కు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఆదివారమొస్తే చాలు.. ఉదయాన్నే దేశమంతా ‘వినుడు వినుడు రామాయణ గాథ’ను వింటూ టీవీలకు అతుక్కుపోయిన రోజలవి. ఇప్పటికీ అరుణ్ గోవిల్ ఎక్కడ కన్పించినా రామున్నే చూసినంత ఆనందంతో కాళ్లకు నమస్కరించి భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటారు.
ఇటీవలే బీజేపీలో చేరిన ఈ 72 ఏళ్ల టీవీ రాముడు యూపీలోని మీరట్ నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు. తనకు రూ.62.99 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్‌తో పాటు రూ.3.19 కోట్ల చరాస్తులు, రూ.5.67 కోట్ల స్థిరాస్తులు, బ్యాంకులో రూ.1.03 కోట్లు, చేతిలో రూ.3.75 లక్షల నగదు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో గోవిల్ వెల్లడించారు. రూ.14.64 లక్షల కారు రుణముందని చెప్పారు. సీరియల్లో రాక్షససంహారం చేసిన ఈ టీవీ రామునిపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవండోయ్!
17 ఏళ్లకు సొంతూరికి...
గోవిల్ పుట్టింది మీరట్‌లోనే. ముంబైలో స్థిరపడ్డారు. రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యలో అడుగుపెడితే ఈ టీవీ రాముడు 17 ఏళ్ల ‘సిటీ’వాసం తర్వాత సొంతూరికి చేరారు. ఆయన కోసం మీరట్‌లో 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రాజేంద్ర అగర్వాల్‌ను బీజేపీ పక్కనబెట్టింది! సమాజ్‌వాదీ నుంచి అతుల్ ప్రధాన్, బీఎస్పీ తరఫున దేవవ్రత్ త్యాగి గోవిల్ ప్రత్యర్థులు. ‘‘ఈ ఎన్నికలతో నేను కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నా. రాముడి ఆశీ్వర్వాదం తప్పకుండా ఉంటుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు గోవిల్. అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకల్లో ఆయన సీరియల్ సీత దీపికా చిఖలియా, లక్ష్మణుడు సునీల్ లాహరితో సహా పాల్గొనడం విశేషం.
–
Comments
Please login to add a commentAdd a comment