ఇక కప్పు కాఫీతో సందేశాలు
న్యూయార్క్: మనం ప్రేమిస్తున్నవారికి మొబైల్ ఎస్సెమ్మెస్‌ల ద్వారానో, సామాజిక వెబ్‌సైట్ల ద్వారానో మాత్రమే సందేశాలు పంపించాల్సిన అవసరం లేదు. కప్పు కాఫీ ద్వారా కూడా మనం కోరుకున్న సందేశాలు పంపించవచ్చు. మన మనసులోని మాటలను కూడా వ్యక్తం చేయవచ్చు. కప్పు కాఫీ నురగపై మనతోసహా మనం కోరుకున్న వారి ఫొటోలను ముద్రించవచ్చు. అది ఎలాగంటారా! అమెరికాకు చెందిన ‘స్టీమ్ సీసీ’ కంపెనీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంక్ జెట్ వ్యవస్థలను అనుసంధానించి ‘రిపిల్ పాడ్స్’ అని సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఫొటోలు, సందేశాలతో కూడి కాఫీని అందించే పరికరాన్ని ‘రిపిల్ మేకర్’ అని పిలుస్తున్నారు.
రిపిల్ మేకర్ కలిగిన కాఫీ హోటల్‌కు వెళితే అక్కడ ఫొటోలను, సందేశాలకు ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్వయంగా మన ఫొటోను, మనతోపాటు వచ్చిన వారి ఫొటోలతో కప్పు కాఫీ తీసుకరమ్మంటే అప్పటికప్పుడు మొబైల్ ద్వారా హోటల్ వెయిటర్ మన ఫొటోలను తీసుకొని రిపిల్ మేకర్‌కు వైఫై టెక్నాలజీ ద్వారా పంపిస్తారు. అంతే...పది సెకడ్లతో కప్పు కాఫీ నురగపై మన ఫొటోలు ముద్రితమై వస్తాయి. కేవలం ఫొటోలే కాకుండా మనమిచ్చే సందేశాలను కూడా కాఫీ నురగపై ముద్రించి మరీ సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ప్రేయసీ, ప్రేమికులకు ఈ కాఫీ సందేశం చక్కగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.
గరిష్టంగా ఏడు అంగుళాల పొడవు, నాలుగున్నర అంగుళాల వెడల్పుతో ఫొటోలను, సందేశాలను రిపిల్ మేకర్ ప్రింట్ చేస్తోంది. కప్పులు అంతకన్నా చిన్నవైనా రిపిల్ మేకర్ ఫొటోలను వాటికి అనుగుణంగా సర్దుబాటుచేసి కాఫీలను అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తుంది. మనం ఎక్కడున్నా రిపిల్ యాప్ ద్వారా మనకు దగ్గర్లోవున్న కాఫీ షాప్‌కు మనం కోరుకున్న ఫొటోలను, సందేశాలను ముందుగానే పంపించే వెసులుబాటు కూడా ఉంది.
వినడానికి విడ్డూరంగ ఉన్న ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ బ్రాండ్ ‘లుఫ్తాన్స’ కొనుగోలు చేసిందని స్టీమ్ సీసీ కంపెనీ సీఈవో యొస్సి మెశూలమ్ మీడియాకు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఫొటోలు కోరుకున్న రంగుల్లో కనిపించవని, కాఫీ రంగులోనే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం వాణిజ్యపరంగానే అందుబాటులో ఉండే రిపిల్ మేకర్ ధర 60 వేల రూపాయలని ఆయన చెప్పారు.