
రాజకీయ కారణాలతోనే..
* అఫ్జల్ గురుకు ఉరిపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్
* ఉరికి కొద్దిగంటల ముందే నాకు సమాచారం ఇచ్చారు
న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును యూపీఏ ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే ఉరి తీసిందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఉరికి కొద్ది గంటల ముందుగా మాత్రమే సమాచారం ఇచ్చారని చెప్పారు.
‘‘ఆరోజు నేను నా సోదరితో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఫోన్ చేశారు. మరుసటి రోజు ఉదయం అఫ్జల్‌గురును ఉరి తీస్తున్నారని, అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేశానని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఏవైనా ఉద్రిక్త పరిణామాలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు’’ అని ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు. అఫ్జల్ ఉరి నిర్ణయాన్ని ముమ్మాటికి రాజకీయ కారణాల వల్లే తీసుకున్నారన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తమపై విమర్శలు గుప్పించే అవకాశం ఇవ్వకూడదనే యూపీఏ సర్కారు గురుతోపాటు కసబ్‌ను ఉరితీసిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిందన్నారు. కాగా, ప్రధాని మోదీ విదేశీ గడ్డపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల మీద విమర్శలు గుప్పించడాన్ని ఒమర్ తప్పుపట్టారు. అంతా తానే చేస్తున్నాన్న భావనలో మోదీ ఉన్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో తాను ప్రధానిగా వచ్చానని, బీజేపీ ప్రతినిధిగా రాలేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాహుల్‌లో ప్రస్తుతం అద్భుతమైన మార్పు వచ్చిందని కొనియాడారు.