ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్ర దాడి, ఒకరు మృతి
సెయింట్-క్వెంటిన్-ఫల్లావియర్: ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్రవాది జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తూర్పు ఫ్రాన్స్ లోని లియాన్ ప్రాంతానికి సమీపంలోని ఉన్న గ్యాస్ ఫ్యాక్టరీలోకి చొరబడిన దుండగుడు ఈ దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఇస్లామిక్ జెండా చేతపట్టుకుని దుండగుడు గ్యాస్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డాడు.
అయితే ఒక వాహనంలో పలువురు గ్యాస్ ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లారని మరో కథనం విన్పిస్తోంది. వీరు లోపలికి వెళ్లిన తర్వాత ఫ్యాక్టరీలో చిన్న పేలుడు సంభవించిన్నట్టు తెలుస్తోంది. ఫ్యాక్టరీకి సమీపంలో తలలేని మొండెం కనుగొన్నారు. అయితే ఇక్కడే హత్య చేశారా, ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి పట్టుకొచ్చి పడేశారా అనేది తెలియరాలేదు. ఇస్లామిక్ జెండాతో వచ్చిన హంతకుడిని అరెస్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఇస్లామిక్ దాడితో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పారిస్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డోపై దాడి జరిగిన ఆరు నెలల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. జనవరిలో ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదులు చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి చేయడంతో 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.