ఉల్లి సేకరణకు రూ. 9.16 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి నుంచి కేంద్రం విడుదల
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ ధరలపై ఉల్లిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 9.16 కోట్లు విడుదల చేసింది. ఉల్లి ధరలు స్థిరీకరించేందుకు రూ. 18.31 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం అంచనా వేసింది. ఇందులో కనీసం 50 శాతం నిధులు విడుదల చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలు కోసం ఈ ఏడాది రాష్ట్రానికి కేటాయించిన రూ. 500 కోట్లలో నుంచి నిధులు విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావు రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 88 సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రాలను మార్కెటింగ్ విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రూ. 8.07 కోట్లు వెచ్చించి 1,934.13 టన్నుల ఉల్లిని సేకరించి సరఫరా చేస్తోంది.