మాఫీపై తేల్చకుండానే వాయిదానా? | Opposition MLAs in the legislature infront protest | Sakshi
Sakshi News home page

మాఫీపై తేల్చకుండానే వాయిదానా?

Published Fri, Oct 2 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

మాఫీపై తేల్చకుండానే వాయిదానా?

మాఫీపై తేల్చకుండానే వాయిదానా?

- శాసనసభ ఎదుట బైఠాయించిన విపక్ష ఎమ్మెల్యేలు
- సర్కారు సభ నుంచి పారిపోయిందంటూ ధ్వజం
- నేతల అరెస్టు, పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

సాక్షి, హైదరాబాద్:
రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేశారంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ శాసనసభ్యులు గురువారం సభ వాయిదా పడిన వెంటనే అసెంబ్లీ నుంచి ప్రదర్శనగా గన్‌పార్కు తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వెళ్లేందుకు ప్రయత్నించారు. దాన్ని పోలీసులు వమ్ము చేయడంతో రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయకుండా సభను వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయిందని, రైతుల ఆత్మహత్యలపై బాధ్యతారహితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రైతు ఆత్మహత్యలను ఆపాలని, ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలని నినదించారు.

ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేఎల్పీ నాయకుడు కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీపీఎం నేత సున్నం రాజయ్య, సీపీఐ నేత రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్ రెడ్డి, జె.గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, రాజాసింగ్ తదితరులు 20 నిమిషాలకు పైగా రోడ్డుపైనే ఆందోళన చేశారు. దాంతో పోలీసులు మరోసారి రంగప్రవేశం చేసి వారందరినీ అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
 
నేతల సంఘీభావం
అరెస్టయిన ఎమ్మెల్యేలను నాంపల్లి పోలీసుస్టేషన్లలో సుమారు 2 గంటలపాటు ఉంచారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీలు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. సభలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నియంతృత్వ పోకడలతో పోతోందంటూ మండిపడ్డారు.
 
రెండో రోజూ ‘విపక్ష ఐక్యత’
రుణమాఫీ అంశంపై ప్రతిపక్షాలు రెండోరోజూ ఐక్యంగా కదిలాయి. నిర్దిష్టమైన హామీ ఇవ్వాల్సిందేనంటూ బుధవారం రాత్రి సభలోనే బైఠాయించిన విపక్షాలు, గురువారం కూడా సభ ప్రారంభం కాగానే అదే ఐక్యతను ప్రదర్శించాయి. ఎంఐఎం మినహా విపక్షాలన్నీ ఐక్యంగా రోడ్డెక్కడంతో కాంగ్రెస్‌లోనూ నూతనోత్తేజం కనిపించింది.
 
ఇంత దుర్మార్గమా?: జానా, జీవన్
రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చండని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోతున్నదని సీఎల్పీ నేత జానారెడ్డి, ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారుకు పట్టడం లేదన్నారు. ‘‘సభను అర్ధంతరంగా వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. వదిలే ప్రసక్తే లేదు’’ అని హెచ్చరించారు. ప్రశ్నించిన ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం, మార్షల్స్‌తో సభ నుంచి బయటకు పంపడం దారుణమని వారు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement