
సేంద్రియ వ్యవసాయం పెంచాలి
సిక్కిం.. సంపూర్ణ సేంద్రియ రాష్ట్రం
సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలని రాష్ట్రాలకు మోదీ పిలుపు
సిక్కింను ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్య; నేడు అసోంలో పర్యటన
గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింను దేశంలోనే తొలి సంపూర్ణ సేంద్రియ రాష్ట్రంగా ప్రధాని మోదీ ప్రకటించారు. త్వరలో సేంద్రీయ వ్యవసాయంలో దేశానికే కాదు ప్రపంచానికే సిక్కిం దిక్సూచిగా మారుతుందంటూ నేపాలీ భాషలో అభినందనలు తెలిపారు. సిక్కింను సుఖిస్తాన్‌గా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘ఆర్గానిక్ సర్టిఫికెట్’ను సిక్కిం సీఎం చామ్లింగ్‌కు అందజేశారు. రాష్ట్రంలో విమానాశ్రయ ఏర్పాటుపై సంకేతాలిచ్చారు. విమానాశ్రయం ఉంటే సిక్కిం స్పెషల్ పూలు సహా సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ సులభమవుతుందన్నారు. గ్యాంగ్‌టక్‌లో సమ్మిళిత వ్యవసాయం, రైతుల సంక్షేమం’ అంశంపై జరిగిన జాతీయ సదస్సునుద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. సదస్సులో దాదాపు అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే, రైతులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్స్, ఆన్‌లైన్ మండీలు.. మొదలైన సాంకేతిక ఆవిష్కరణలు రావాలన్నారు. ప్రకృతి ప్రకోపాలతో కుదేలవుతున్న రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై దృష్టి పెట్టాలంటూ ఓ సూచన చేశారు. ‘మీ భూమిని మూడు భాగాలు చేసుకోండి. ఒక భాగంలో పంటలు వేయండి. మరో భాగంలో కలప కోసం చెట్లు పెంచండి. మూడో భాగాన్ని పశువుల పెంపకం కోసం వినియోగించండి. పంటలు సరిగ్గా పండని సమయంలో మిగతా రెండు మీకు ఆర్థికంగా సహకరిస్తాయి’ అని మోదీ సూచించారు. రైతులు, సాగు, గ్రామాలు.. వీటిని వేర్వేరుగా చూడడం వల్ల అభివృద్ధి చెందలేమని, వీటన్నిటి సమ్మిళితంగా వ్యవసాయాన్ని చూసే దృష్టికోణం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే వ్యవసాయంలో సిక్కిం రాష్ట్రం కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం విజయగాధను ప్రశంసిస్తూ.. అది అంత సులభంగా సాధించే ఘనత కాదన్నారు. ‘సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాలనుకున్నప్పుడు కొందరినుంచి వ్యతిరేకత వచ్చి ఉంటుంది. కానీ సిక్కిం రైతులు వెనకడుగు వేయలేదు. దశాబ్దం పాటు తమ ఆలోచననే నమ్ముకుని విజయం సాధించారు’ అని కొనియాడారు. సిక్కిం విజయాన్ని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ‘100-150 గ్రామాలున్న ఒక జిల్లానో, తాలూకానో ఎంపిక చేసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించండి. అక్కడ విజయవంతం అయితే, రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. నాయకులు, శాస్త్రజ్ఙులు చెప్పే ప్రసంగాలను రైతులు నమ్మరు. వారు ప్రత్యక్షంగా చూస్తేనే నమ్ముతారు’ అన్నారు. సేంద్రీయ పంటలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్న మోదీ.. ఆ మార్కెట్ దిశగా రాష్ట్రాలు దృష్టి పెట్టాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల రెండ్రోజుల పర్యటనలో భాగంగా సిక్కిం చేరుకున్న ప్రధానికి గవర్నర్ పాటిల్, సీఎం స్వాగతం పలికారు. మంగళవారం రిడ్జ్ పార్క్‌లో నిర్వహించనున్న ఉద్యాన, పూల ఉత్సవంలో ప్రధాని పాల్గొంటారు.
‘వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధించాలి’
వ్యవసాయ రంగంలో సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. సవాళ్లను ఎదుర్కొని సాగు రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించాలన్నారు. నిలకడైన వ్యవసాయం, రైతుల సంక్షేమం అనే అంశంపై సదస్సులో ఆయన ప్రసంగించారు. తాము ప్రవేశపెట్టిన నేల ఆరోగ్య కార్డు, వేప పూత యూరియా, పీఎంకేఎస్‌వై తదితర పథకాలతో రైతులకు ప్రయోజనాలు సమకూరుతాయన్నారు. గత పథకాల్లోని లోటుపాట్లను గుర్తించి, సవరించి కొత్త పథకాలు తీసుకొచ్చామని వివరించారు. సిక్కిం సీఎం చామ్లింగ్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా తమ రాష్ట్రం నిలవడం గర్వకారణమన్నారు. రసాయన ఎరువులు ఏ విధంగా బ్యాన్ చేసింది, సేంద్రియ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహించింది వివరించారు.