త్వరలో దేశవ్యాప్తంగా 100 చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు.
త్వరలో దేశవ్యాప్తంగా 100 చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా కిషన్గఢ్ విమానాశ్రయానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఇది మూడేళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఇందుకు ఖర్చు సుమారు 160 కోట్ల రూపాయలు అవుతుంది. ఒకప్పుడు విమానాలంటే కేవలం ధనవంతులకే పరిమితం అయ్యేవని, ఇప్పుడు ఆకాశ మార్గం అందరికీ అవసరం అయిపోతోందని.. దేశాభివృద్ధికి ఇది ఉపయుక్తమని ప్రధాని తెలిపారు.
విమాన యానాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యాలలో ఒకటని ఆయన చెప్పారు. ఇన్నాళ్లూ కేవలం పెద్ద నగరాలకు మాత్రమే విమాన సదుపాయం ఉండేదని, ఇక మీదట చిన్న నగరాలకూ ఈ అవకాశం కల్పిస్తామని ప్రధాని అన్నారు. త్వరలో తాము చేపట్టబోతున్న వంద విమానాశ్రయాల ప్రాజెక్టులో మొదటిది కిషన్గఢ్ అని మన్మోహన్ తెలిపారు. గత సంవత్సరం దేశంలో 16 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారన్నారు. 2020 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా వైమానిక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సూఫీ గురువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ దర్గాకు ఈ నగరం అత్యంత సమీపంలో ఉంటుంది.