
100 విమానాశ్రయాల అభివృద్ధి: మన్మోహన్
దేశవ్యాప్తంగా పట్టణాల్లో 100కుపైగా చిన్న ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు.
జైపూర్: దేశవ్యాప్తంగా పట్టణాల్లో 100కుపైగా చిన్న ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు. పట్టణాలు దేశ ఆర్థికాభివృద్ధికి ఇంజన్ల వంటివని, వాటిమధ్య విమాన కనెక్టివిటీకి పెద్దపీట వేస్తామని చెప్పారు. శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో కిషన్‌గఢ్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం జైపూర్ మెట్రో మొదటి దశను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘దేశంలో 100కుపైగా విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇందులో కిషన్‌గఢ్ ఎయిర్‌పోర్టు మొదటిది. దశలవారీగా మిగతావి చేపడతాం. స్థూల దేశీయోత్పత్తిలో 60 శాతం వాటా పట్టణ ప్రాంతాలదే. పట్టణాలు ఆర్థికాభివృద్ధికి ఇంజన్ల వంటివి. 2031నాటికి పట్టణాల్లో జనాభా 60 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న పట్టణీకరణ.. అదే స్థాయిలో సవాళ్లను కూడా మోసుకొస్తోంది. అందులో ముఖ్యమైనది రవాణా. అందుకే పట్టణాల మధ్య విమాన రాకపోకలకు పెద్దపీట వేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌరవిమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్, కేంద్రమంత్రి సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు.