ఒవైసీ పౌరసత్వం రద్దుచేయండి
శివసేన డిమాండ్
ముంబై: ‘భారత్ మాతాకీ జై’ అని నినదించేందుకు నిరాకరిస్తానన్న మజ్లిస్ పార్టీ చీఫ్ ఒవైసీ భారత పౌరసత్వాన్ని రద్దుచేసి.. చట్టపరంగా ఉరితీయాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ సంపాద కీయంలో ఒవైసీపై నిప్పులు చెరిగింది. ఒవైసీలాగా వ్యవహరించే అందరికీ పౌరసత్వాన్ని రద్దుచేసి.. ఓటింగ్ హక్కులు తొలగించాలని డిమాం డ్ చేసింది. ‘మహారాష్ట్రలోకి వచ్చి ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తే.. అతను తిరిగి ఎలా వెళ్లగలిగారు? ఇందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమాధానం చెప్పాలి? హార్దిక్ పటేల్ అనుకోకుండా జాతీయపతాకాన్ని అవమానపరిస్తే.. జైలుకు పంపించాం కదా! కానీ ఇప్పుడు భారతమాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీని చట్టపరంగా ఉరితీయాలి’ అని పేర్కొంది.
ముస్లింలు ఇంకా వెనుకబడి ఉండేందుకు ఒవైసీ లాంటి వ్యక్తులే కారణమని.. పేర్కొంది. మరోవైపు, తాజా పరిణామాలతో ఉత్తరప్రదేశ్‌లో జరగాల్సిన ఒవైసీ పర్యటను అనుమతి రద్దుచేస్తున్నట్లు లక్నో మెజిస్ట్రేట్ ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నందునే మజ్లిస్ చీఫ్ రెండ్రోజుల పర్యటనకు అనుమతులు ఇవ్వటం లేదని స్పష్టం చేసింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంపై ఎంఐఎం తీవ్ర విమర్శలు చేసింది. మజ్లిస్ పార్టీ ఎదుగుదలను అడ్డుకునేందుకే అనుమతులు ఆపారని ఆరోపించింది.