* పాక్ ఉగ్రవాదుల మర పడవను అడ్డుకున్న తీరదళం
* కరాచీ నుంచి ఆయుధాలు, మందుగుండుతో భారత్‌లోకి మరపడవ!
* దేశంలో విధ్వంసానికేనని అనుమానం
* అడ్డుకున్న కోస్ట్ గార్డ్ నౌక; గంటపాటు కొనసాగిన వేట
* తప్పించుకునే మార్గం లేక పేల్చేసుకున్న దుండగులు; పడవలో భారీ పేలుళ్లు
* మంటల్లో చిక్కుకుని సముద్రంలో మునిగిపోయిన పాక్ పడవ
దేశంలో ముంబై 26/11 తరహాలోనే మరో మారణహోమానికి పొరుగుదేశపు ఉగ్రవాదులు కుట్రపన్నారా? నూతన సంవత్సర వేడుకల్లో భారతావని మునిగి ఉండగా.. చీకటి మాటున అరేబియా సముద్రం ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఆయుధాలను, ఆధునిక పేలుడు సామగ్రిని దేశంలోకి చేరవేసి మరో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్ర రాక్షసులు ప్రణాళికలు రచించారా?.. డిసెంబర్ 31 అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ఉంది.
గుజరాత్ తీరంలో కరాచీ నుంచి వస్తున్న మరపడవను.. నిఘా సమాచారం ఆధారంగా భారతదేశ తీర రక్షక దళం అడ్డుకుంది. పడవను ఆపేయాలని, సోదాకు సహకరించాలని కోస్ట్ గార్డ్ చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టిన పడవ సిబ్బంది(ఉగ్రవాదులు?) తప్పించుకునేందుకు ప్రయత్నించి.. సాధ్యం కాక పడవను పేల్చేశారు. భారీ పేలుడు శబ్దాల అనంతరం మంటల్లో చిక్కుకున్న ఆ మరపడవ సముద్రంలో మునిగిపోయింది. అందులోని నలుగురు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మొత్తం మీద మరో ఉపద్రవాన్ని తీర రక్షక దళం విజయవంతంగా అడ్డుకుంది.
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ‘డిసెంబర్ 31 అర్ధరాత్రి... మరికాసేపట్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది.. దేశవ్యాప్తంగా వేడుకల్లో మునిగితేలుతున్న ప్రజలు. చిమ్మ చీకట్లో అరేబియా సముద్రం. గుజరాత్‌లోని పోర్‌బందరు తీరానికి దాదాపు 350కి.మీల దూరంలో పాకిస్తాన్ సముద్రజలాల్లోంచి చేపలు పట్టేందుకు ఉపయోగించే ఒక మర పడవ భారత్ వైపు దూసుకువస్తోంది. అందులో పెద్ద ఎత్తున ఆయుధాలు. మందుగుండు సామగ్రి. భారత సముద్ర జలాల్లో 8 కి.మీ.ల లోపలికి వచ్చిన ఆ పడవను గుర్తించిన తీరప్రాంత నిఘా వ్యవస్థ అక్కడి కోస్ట్‌గార్డ్ షిప్‌ను అప్రమత్తం చేసింది.
దాంతో కోస్ట్‌గార్డ్ షిప్, తీర రక్షణ దళానికే చెందిన డోర్నియర్ యుద్ధ విమానం ఆ మరపడవ వైపుకు దూసుకువెళ్లాయి. వీటిని గుర్తించిన మరపడవ సిబ్బంది తమ పడవను గుర్తించకుండా అందులోని లైట్లను ఆర్పేశారు. మళ్లీ పాక్ జలాల్లోకి తప్పించుకుని వెళ్లేందుకు పడవ వేగం పెంచారు. ఆ వెనకే వారిని వెంటాడుతూ భారత తీర రక్షక దళ నౌక.. ఆకాశంలో యుద్ధవిమానం..! దాదాపు గంటపాటు ఛేజింగ్ కొనసాగింది. మరపడవ చేరువలోకి వెళ్లిన తీర రక్షక దళ నౌక ఆ పడవను అడ్డుకుంది. ఆ మర పడవను, అందులోని సామగ్రిని సోదా చేసేందుకు వీలుగా ఆ పడవను ఆపేయాలని తీరరక్షక దళ సిబ్బంది హెచ్చరించారు.
హెచ్చరికగా పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇక తప్పించుకోవడం అసాధ్యం అని అర్థమైన ఆ మరపడవలోని ముష్కరులు.. తమ పడవలోని డెక్ కిందకు వెళ్లారు. ఆ కాసేపటికే అందులోంచి భారీ స్థాయిలో పేలుళ్లు ప్రారంభమయ్యాయి. మంటల్లో చిక్కుకున్న ఆ పడవ నెమ్మదిగా మునిగిపోయింది. అప్పటికి జనవరి 1 తొలి వెలుగులు ప్రారంభమయ్యాయి...’ ఇదేం బాలీవుడ్ యాక్షన్ సిని మా సీన్ కాదు.
డిసెంబర్ 31 అర్ధరాత్రి నిజంగా జరిగిన ఘటన. భారత్‌లో మరో ఉగ్రవాద దారుణం జరగకుండా విజయవంతంగా అడ్డుకున్న ఘటన. 1993, 2008 నవంబర్ 26 (26/11)ల నాటి ముంబై దాడులను గుర్తు చేసిన ఘటన. అప్పుడు ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారానే ముంబైలో ప్రవేశించి నరమేధం సాగించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా మరోమారు దేశంలో విధ్వంసం సృష్టించే లక్ష్యంతో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండుతో మరపడవలో ఉగ్రవాదులు వస్తూ ఉండి ఉండొచ్చని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.
పాకిస్థాన్ పడవే..
తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ పడవ కరాచీ దగ్గర్లోని కేతిబందర్‌కు చెందినదని, అరేబియా సముద్రంలో ఏదో అక్రమ కార్యకలాపాల నిర్వహణలో భాగంగానే అది భారతజలాల్లోకి వచ్చిందని భారత రక్షణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిఘా వ్యవస్థ సమాచారం ఆధారంగా కోస్ట్‌గార్డ్ షిప్, యుద్ధవిమానం సమన్వయంతో ఆపరేషన్ ప్రారంభించాయని పేర్కొంది. ‘ఆ బోట్ డెక్‌పై నలుగురు వ్యక్తులు కనిపించారు. బోట్‌ను ఆపేయాల్సిందిగా భారత తీరరక్షణ దళం చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టి, లోపలికి వెళ్లి వారు ఆ పడవను పేల్చేశారు. చీకటి, బలమైన గాలులు, ప్రతికూల వాతావరణం వల్ల ఆ పడవను స్వాధీనం చేసుకోలేకపోయాం. అలాగే, అందులోని వారిని ప్రాణాలతో పట్టుకోలేకపోయాం’ అని ఆ ప్రకటనలో రక్షణ శాఖ తెలిపింది.
ఆ పడవలో నుంచి ఎవరైనా తప్పించుకున్నారా? అనే కోణంలో తీర రక్షక దళానికి చెందిన నౌకలు, విమానాలు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా గాలింపు జరుపుతున్నాయని వెల్లడించింది. పాక్‌కు చెందిన ఆ పడవలోని సిబ్బంది తమను తాము పేల్చేసుకోవడం.. ఆ పడవలో పేలుడు పదార్థాలున్నాయన్న విషయాన్ని నిర్ధారిస్తుందని తీరరక్షక దళ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ కేఆర్ నౌతియాల్ వ్యాఖ్యానించారు.
తప్పుడు ఉద్దేశం లేకుంటే వారు తప్పించుకునేందుకు, పడవలోని లైట్లు ఆర్పేందుకు ప్రయత్నించేవారు కాదని వివరించారు. దీన్ని తీవ్రమైన అంశంగానే పరిగణిస్తున్నామని ఆ పడవ గమ్యస్థానం ఏంటో ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. నిఘా, నౌకాదళ వర్గాల అద్భుత సమన్వయం వల్లనే ఆ పడవను అడ్డుకోగలిగామన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 26 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటన చోటు చేసుకోవడంతో భద్రతాదళాలు, నిఘా వర్గాలు మరింత అప్రమత్తమయ్యా యి.
మరోవైపు, గుజరాత్‌లో త్వరలో వైబ్రాంట్ గుజరాత్- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీరప్రాంత భద్రతను, నిఘాను కట్టుదిట్టం చేశారు. సముద్రం మీదుగా మరోసారి ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించే అవకాశముందన్న వివిధ నిఘా సంస్థల సమాచారంతో గత కొన్ని నెలలుగా సముద్రజలాల్లో, తీర ప్రాంతంలో గస్తీని మరింత తీవ్రం చేశారు.
కోస్ట్‌గార్డ్‌కు ప్రశంసలు..
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నవారిని, తీరరక్షణ దళాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రశంసించారు. భారత్‌లో ఉగ్ర దాడులకు పాక్ సహకరిస్తోందనేందుకు ఇది తాజా ఉదాహరణ అని బీజేపీ వ్యాఖ్యానించింది. పొరుగుదేశం నిస్పృహకు ఇది అద్దం పడుతోందని విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ సాయుధ దళాలకు మరిన్ని అధికారాలు ఇచ్చినందువల్లనే.. ఆదేశాల కోసం ఢిల్లీ వైపు చూడకుండా సమయానికి స్పందించాయని పేర్కొంది.
ఆపరేషన్ ఇలా జరిగింది..!
* సాంకేతికపర నిఘా సమాచారం అందించే ‘జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)’ ఒక అనుమానాస్పద టెలిఫోన్ సంభాషణను గుర్తించింది. భారత్‌కు దగ్గర్లో డెలివరీ చేయాల్సిన ఒక ‘ఖరీదైన’ రవాణా సామగ్రి గురించిన సంభాషణ అది. ఆ తరువాత ‘ఆ సామగ్రిని ఎవరికి అందించాలో వారికి డబ్బులు చెల్లించాం. వారు సిద్ధంగా ఉన్నారు’ అనే మరో సంభాషణనూ గుర్తించింది.
* డిసెంబర్ 31 ఉదయం 9.30కు పాక్ వైపు నుంచి వస్తున్న అనుమానాస్పద పడవ గురించి తీరరక్షక దళానికి మొదటి నిఘా సమాచారం అందింది.
* ఉదయం 11.30 గంటలకు నౌకాదళానికి చెందిన డోర్నియర్ యుద్ధ విమానం ఆ అనుమానాస్పద పడవ గురించి గాలింపు ప్రారంభించింది. దానికి కాసేపటి తరువాత మరో రెండు విమానాలు జత కలిశాయి.
* దాదాపు 15 నాటికల్ మైళ్లు భారతీయ జలాల్లోకి వచ్చేసి నెమ్మదిగా కదులుతున్న ఒక బోట్‌ను డోర్నియర్ యుద్ధ విమానం గుర్తించింది. తీరరక్షక నౌక ‘రాజారతన్’ ఆ బోట్ ఉన్న వైపునకు బయల్దేరింది.
* ఆ బోట్‌ను రాజారతన్ నౌక గుర్తించి నేవిగేషన్ లైట్లు వేయాలని అందులోని సిబ్బందిని కోరినప్పుడు, వారు తమ ప్రయాణ మార్గాన్ని పలుమార్లు మార్చుకుని, వేగం పెంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
* గంటపాటు ఈ ఛేజింగ్ కొనసాగింది. బోట్లో ఇంధనం అయిపోవడం వల్ల కాబోలు బోట్ వేగం తగ్గింది.
* జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో పాకిస్తాన్ బోట్లోంచి భారీ పేలుళ్లు, మంటలు ప్రారంభమయ్యాయి. పడవ మునిగిపోసాగింది. అంతకుముందు ఆ పడవ డెక్‌పై నలుగురు వ్యక్తులు కనిపించారు.
మరో 26/11 కుట్ర?
Published Sat, Jan 3 2015 1:27 AM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM
Advertisement
Advertisement