'అదృశ్యమైన విమానం మా దేశంలోకి రాలేదు'
గత శనివారం అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం తమ దేశ భూభాగంలోకి ప్రవేశించ లేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఆచూకీ తెలియకుండా పోయిన విమానం తమ దేశంలో ఉందని వస్తున్న వార్తలను పాకిస్థాన్ ప్రధాన మంత్రి ప్రత్యేక సహాయకుడు సుజాత్ అజీమ్ ఖండించారు. సుజాత్ అజీమ్ డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మలేషియా ఎయిర్ లైన్స్ తమ దేశంలోకి ప్రవేశించినట్లు రాడార్లు ఎక్కడ గుర్తించలేదన్నారు. గల్లంతైన విమాన ఆచూకీ కోసం వివిధ దేశాలకు చెందిన దాదాపు 95 పైగా నౌకలు బంగాళాఖాతంలో గాలింపు చర్యలు ఇప్పటికి కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.అదృశ్యమైన విమాన ఆచూకీ కోసం పాక్ తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
మార్చి 8వ తేదీ అర్థరాత్రి మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయలుదేరింది. బయలుదేరిని 40 నిముషాల అనంతరం ఆ విమానం మలేషియా విమానాశ్రయం ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు ఎనిమిది రోజులుగా గల్లంతైన విమానం కోసం మలేషియా, చైనా, వియత్నాం, అమెరికాతోపాటు పలు దేశాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టిన అణు
మాత్రం ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో మలేషియా ప్రభుత్వం తల పట్టుకుంది.
విమానాన్ని హైజాక్ చేసి ఉంటారని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ అనుమానం వ్యక్తం చేశారు.ఆ విమానాన్ని మలేషియా వియత్నాం మధ్యలో ఉన్నప్పుడు దారి మళ్లించారని, బహుశా కజకిస్థాన్ -తుర్కెమెనిస్థాన్లకు తీసుకెళ్లి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.లేదా పాక్కు తరలించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గల్లంతైన విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే.