కశ్మీర్‌పై అమెరికాకు పాక్ హెచ్చరికలు!
వాషింగ్టన్: కశ్మీర్ విషయంలో తమ వాదనను అమెరికా అంగీకరించకపోవడంతో బిత్తరపోయిన పాకిస్థాన్ రాయబారులు ఏకంగా ఆ దేశానికి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ శక్తి కాదని పేర్కొన్నారు. భారత్, కశ్మీర్ విషయంలో తమ వాదనను పట్టించుకోకపోతే తాము రష్యా, చైనాకు దగ్గరవుతామని అమెరికాను హెచ్చరించారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కశ్మీర్‌పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాయబారి ముషాహిద్ హుస్సేన్ సయెద్ ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా ప్రధాన మేధోసంస్థ అయిన అట్లాంటిక్ కౌన్సిల్‌లో సంప్రదింపులు ముగిసిన వెంటనే.. 'అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ శక్తి కాదు. దాని ప్రపంచాధిపత్యం తగ్గిపోతున్నది. దాని గురించి మరిచిపోదాం' అంటూ ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, ఈ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తెచ్చేందుకు పాక్ ప్రధాని షరీఫ్ రాయబారులను నియమించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా అమెరికాకు తన వాదన వినిపించి మద్దతు పొందేందుకు షరీఫ్ రాయబారులు హుస్సేన్ సయెద్, షాజ్రా మన్సద్ ఇక్కడికి వచ్చారు. అయితే, ఉగ్రవాదం విషయంలో అమెరికా పాకిస్థాన్‌కు ఘాటు సందేశం ఇవ్వడంతో ఇరుకునపడ్డ ఈ రాయబారాలు ఇలా తమనోటికి పనిచెప్పారు. కశ్మీర్ విషయమై 90 నిమిషాల పాటు అమెరికా ప్రతినిధులకు సయెద్ వివరించారు. ఆయన డొల్లవాదనకు సంఘీభావం లభించకపోవడంతో చికాకుపడ్డ సయెద్.. అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీచేశారు. ఇవి అధికారికంగా కెమెరాలో రికార్డు కాకపోయినా.. ఆహూతులకు స్పష్టంగా వినిపించాయి.