'నువ్వు లాడెన్ మిత్రుడివి'
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతానికి విముక్తి ప్రసాదించాలని కోరుతూ ఓ నిరసనకారుడు ఆయనను ఘెరావ్ చేశారు. వాషింగ్టన్‌లో ప్రముఖ మేధోసంస్థ అయిన యూఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన ప్రసంగానికి అడ్డుపడిన నిరసనకారుడు 'బలూచిస్థాన్‌కు విముక్తినివ్వండి' అంటూ నినాదాలు చేశాడు. 'నువ్వు లాడెన్ స్నేహితుడివి' అంటూ షరీఫ్‌ను విమర్శించాడు.
'ఫ్రి బలూచిస్థాన్' అంటూ పోస్టర్ ప్రదర్శించాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటనతో కాసేపు తన మౌనంగా ఉండిపోయిన షరీఫ్ ఆ తర్వాత యథాతథంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 65 ఏళ్ల షరీఫ్ పాక్ ప్రధాని రెండోసారి అమెరికా పర్యటనకు వచ్చారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. బలూచిస్థాన్‌లో వేర్పాటువాదులు గత కొన్నాళ్లుగా పాక్ ఆర్మీతో కొట్లాడుతున్నారు. తాజాగా తలెత్తిన వేర్పాటువాదుల తిరుగుబాటుతో ఈ ప్రాంతం మళ్లీ కల్లోలితంగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ సైన్యమే కిడ్నాప్‌లకు పాల్పడి.. ఆందోళనకారులను హింసించి చంపుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.