ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తైంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నేత రజా రియాక్ జరిపిన చర్చలు సఫలం అయ్యారు. ఈ ఇద్దరూ బెలూచిస్తాన్‌కు చెందిన సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కాకర్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో.. పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆగష్టు 9వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. దీంతో ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఈ ఎంపికలో ప్రతిపక్ష నేత రజా రియాజ్‌దే ముఖ్యభూమిక అయ్యింది. ఆపద్ధర్మ ప్రధానిగా చిన్న ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తి ఉండాలనే నిర్ణయంతో కాకర్ పేరును ప్రతిపాదించగా.. అందుకు షెహబాజ్ సైతం అంగీకరించారు. దీంతో ఈ పేరును పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వికి పంపించగా.. ఆయన ఆమోద ముద్ర వేశారు.
చిన్న ప్రావిన్స్ అయినా.. బెలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ గురించి పాక్ ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే.. ఆ ప్రాంతమంతా తిరుగుబాట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది కాబట్టి. కాకర్ తొలినాళ్లలో విదేశాల్లో ఉంటున్న పాక్ ప్రజల సంరక్షణ, హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన సెనెట్ స్టాండింగ్‌కమిటీకి చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత బెలూచిస్తాన్ అధిరాకప్రతినిధిగా పని చేశారు. 2018లో బెలూచిస్తాన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై.. అటుపై బెలూచిస్తాన్ ఆవామీ పార్టీలో చేరారు. ప్రస్తుతం సెనేట్‌లో పార్లమెంటరీ లీడర్‌గా ఉన్నారాయన.
ఎన్నికలు మరింత ఆలస్యం
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు అయిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, జనాభా పెరుగుదల కారణంగా.. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగాకే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. దీంతో పాకిస్తాన్ ఎన్నికలకు నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment