పాక్ ప్రధానిపై అనర్హత వేటు!
లాహోర్: ఏ దేశ ప్రధాని మాట్లాడటానికి సాహసించని రీతిలో ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాది బుర్హాన్ వనీని కీర్తించడమేకాక ఉడీ దాడి కశ్మీర్ ఆందోళనలకు కొనసాగింపని ఉగ్రవాదులను పచ్చిగా వెనకేసుకొచ్చిన పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణల విషయంలో తీవ్ర రాజకీయ సంక్షోబాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొన్ని నెలల కిందట ప్రకంపనలు సృష్టించిన 'పనామా పేపర్స్' వ్యవహారంలో నవాజ్ షరీఫ్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీల ముసుగులో వేల కోట్ల అక్రమ సంపాదనను పోగేసుకున్నవారి జాబితాలో షరీఫ్ పేరు పై వరుసలో కనిపించింది. దీంతో షరీఫ్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. పనామా పేపర్స్ లీకేజీల ఆధారంగా అసెంబ్లీ రూల్స్ లోని 62,63 నిబంధనలను అనుసరించి ప్రధాని నవాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దుచేసి, అనర్హుడిగా ప్రకటించాలని ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ఆ క్రమంలోనే పీటీఐ సభ్యులు ఆగస్టు 15న అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సిద్దిఖీకి ఒక నివేదిక సమర్పించారు. అందులో షరీఫ్ అక్రమ ఆస్తులు, ఇతర ఆర్థిక నేరాల చిట్టాలను పొందుపర్చారు.
కాగా, ఆ నివేదికను జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాస్ సిద్దిఖీ శనివారం పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ కు పంపారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నవాజ్ రాజకీయ భవితవ్యం ఉడబోతోంది. అయితే విచారణ జరపకుండా నవాజ్ పై వేటు వేసే అవకాశమేలేదని, ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ వ్యాఖ్యానించింది.