పాక్‌కు దిమ్మతిరిగే రుజువులు ఇవిగో!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సైనికులు లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్ ప్రమేయాన్ని చాటుతూ తిరుగులేని ఆధారాలను ఆర్మీ బయటపెట్టింది. నౌగామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల వద్ద దొరికిన గ్రనేడ్లు పాకిస్థానీవేనని పేర్కొంది. గురువారం నౌగామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. ‘ ఉగ్రవాదుల వద్ద దొరికిన హ్యాండ్ గ్రనేడ్లు (ఏఆర్జీఈఎస్ 84), యూబీజీఎల్ గనేడ్లపై పాక్ అధికారిక ఆయుధ ఫ్యాక్టరీ మార్కింగ్స్ ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రేరేపించడంలో పాకిస్థాన్ పాత్రను ఇవి చాటుతూ ఉన్నాయి’ అని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల వద్ద దొరికిన ఔషధాలు, తినుబండారాలపైన కూడా పాకిస్తానీ మార్కింగ్స్ ఉన్నాయని ఆయన వివరించారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కశ్మీర్లోకి చొరబడుతున్న నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు గత గురువారం మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల వద్ద ఆరు ప్లాస్టిక్ పేలుడు స్లాబ్స్, ఆరు బాటిళ్ల పెట్రోలియం జెల్లీ వంటి తీవ్రస్థాయి పేలుడు పదార్థాలు దొరికాయి. సెప్టెంబర్ 11 పూంచ్, సెప్టెంబర్ 18న ఉడీ ఉగ్రవాద దాడుల తరహాలోనే ఎక్కువ మండే పేలుడు పదార్థాలతో దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించారని, ఉగ్రవాదులను పాకిస్థాన్ నేరుగా ప్రోత్సహించి.. వారి కుట్రలో భాగం పంచుకుంటున్న విషయాన్ని ఈ ఆధారాలు చాటుతున్నాయని ఆర్మీ తెలిపింది.