
ప్రముఖ నటి దారుణహత్య
ప్రముఖ నటి కిస్మత్ బేగ్‌ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు..
షో ముగించుకుని ఇంటికి తిరిగి బయలుదేరిన ఆమెను ఆగంతకులు వెంటాడారు. ఆమె ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా బైక్‌ల ఆపి యాక్సిడెంట్ చేశారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే సాయుధులు ఆమెను చుట్టుముట్టారు. ‘ఇప్పుడు చెయ్యగలవా డాన్స్..’ అని కోపంగా అరుస్తూ తుపాకులతో నటి కాళ్లు, చేతులు, పొట్టభాగంలో విచక్షనారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు నటిని, ఆమె డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆమె కన్ను మూసింది. ఆమె పేరు.. కిస్మత్ బేగ్. ప్రముఖ పాకిస్థానీ రంగస్థలనటి.
లాహోర్ నగరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న కిస్మత్ బేగ్ హత్యోదంతం పాకిస్థానీ కళారంగాన్ని కుదిపేసింది. కిస్మత్ మాజీ ప్రియుడు, ఫైసలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘ఇక నువ్వు డాన్స్ ఎలా చేస్తావో చూస్తాం..’అని హంతకులు మాట్లాడటాన్నిబట్టి ఇది ప్రతీకార హత్యగా భావిస్తున్నట్లు, సదరు ఫైసలాబాద్ వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నించనున్నట్లు దర్యాప్తు అధికారి అస్గర్ హుస్సేన్ మీడియాకు చెప్పారు.
పోస్ట్‌మార్టం అనంతరం కిస్మత్ మృతదేహంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. నిందితులను అరెస్ట్‌చేయాలని నినాదాలు చేశారు. గడిచిన కొద్ది నెలలుగా పాకిస్థాన్ టీవీ, రంగస్థల నటీమణులపై దాడులు పెరిగిపోయాయి. గత జులైలో టాప్ మోడల్ ఖందిల్ బలూచ్ దారుణ హత్య, అంతకుముందు టీవీ యాంకర్‌పై విషప్రయోగం, మరో తొమ్మిది మంది కళాకారిణుల హత్యలు.. పాకిస్థాన్‌లో శాంతిభద్రతల లేమిని తెలియజేస్తాయి. అభిమానినని చెప్పుకున్న ఓ దుండగుడు విషం కలిపిన ఐస్‌క్రీమ్ తినిపించిన ఘటనలో టీవీ యాంకర్ ప్రాణాలు కోల్పోయింది. నద్రా, నగూ, యాస్మిన్, నైనా, నగీనా, మార్వీ, కరిష్మా, సంగమ్, ఆర్జూ లాంటి రంగస్థల నటీమణులు లాహోర్, ముల్తాన్ నగరాల్లో దారుణ హత్యలకు గురయ్యారు.