పాకిస్థాన్తో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని, కానీ తమమీద ఏమైనా చర్యలు చేపడితే మాత్రం పూర్తిస్థాయి యుద్ధానికి తెగబడతామని పాకిస్థానీ తాలిబన్లు తెలిపారు.
పాకిస్థాన్తో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని, కానీ తమమీద ఏమైనా చర్యలు చేపడితే మాత్రం పూర్తిస్థాయి యుద్ధానికి తెగబడతామని పాకిస్థానీ తాలిబన్లు తెలిపారు. ప్రభుత్వం కావాలనుకుంటే చర్చలకు సిద్ధమేనని, కానీ వాళ్లు యుద్ధమే కావాలనుకుంటే తాము కూడా దాన్నే ఎంచుకుంటామని తెహరిక్ - ఎ - తాలిబన్ పాకిస్థాన్ రాజకీయ కమిషన్ సీనియర్ సభ్యుడు ఇహ్సానుల్లా ఇహ్సాన్ తెలిపారు. తాలిబన్లు శాంతి చర్చలకు ముందుకొచ్చారని, ఇక పాక్ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని చెప్పినట్లు ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.
ప్రభుత్వం శాంతికి, సమరానికి కూడా సిద్ధమేనన్న పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇహ్సాన్ స్పందించారు. నిసార్ అలీఖాన్ యుద్ధానికి సిద్ధమతే తాము కూడా నూరుశాతం ఆ సవాలు స్వీకరించేందుకు సిద్ధమేనని చెప్పారు. గతంలో పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం శాంతిమంత్రం జపించిందని, ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా చర్చలకు సిద్ధమనే చెప్పారని అన్నారు.
గతంలో పీపీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా షరతులతో కూడిన చర్చల కోసం తాలిబన్లు ముందుకొచ్చారు. కానీ, పీపీపీ సర్కారు దాన్ని పట్టించుకోకుండా, ఆయుధాలు దించి వస్తేనే ఎలాంటి చర్చలకైనా అంగీకరిస్తామని తెలిపింది. మే 11న పాకిస్థాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తాలిబన్లు తమ దాడుల ఉధృతిని పెంచారు. రెండు నెలల్లో దాదాపు 400 మందిని హతమార్చారు.