
రఫియాబాద్ లో అప్రమత్తమైన సైనికులు. (ఇన్ సెట్లో) పాక్ ఉగ్రవాది అహ్మద్
భారత్‌లోకి చొరబడిన ఐదుగురు టైస్టులు
♦ ఆర్మీతో ఎదురుకాల్పుల్లో నలుగురు హతం
♦ ఒకరిని ప్రాణాలతో పట్టుకున్న భద్రతాదళాలు
♦ పాక్‌లోని ముజఫర్‌గఢ్‌కు చెందినవాడుగా గుర్తింపు
శ్రీనగర్: మరో పాక్ ఉగ్రవాది సజీవంగా చిక్కా డు. భారత్‌లో మారణహోమం సృష్టించేందుకు మరో నలుగురితో కలిసి సరిహద్దులు దాటి వచ్చిన సజ్జాద్ అహ్మద్(22) అనే ఒక టెర్రరిస్టును భారత భద్రతాదళాలు గురువారం సజీవంగా పట్టుకున్నాయి.
మిగతా నలుగురిని ఎదురుకాల్పుల్లో హతమార్చాయి. సజ్జాద్ అహ్మద్ వాయువ్య పాకిస్తాన్‌లోని ముజఫర్‌గఢ్‌కు చెందిన, లష్కరే తోయి బా ఉగ్రవాదని ప్రకటించాయి. ఆగస్ట్ 5న ఉధంపూర్ ఉగ్రదాడి అనంతరం నవేద్ అనే లష్కరే తోయిబా ఉగ్రవాది ప్రాణాలతో చిక్కిన విషయం తెలిసిందే.
ఇలా చిక్కాడు..:తాజా ఎన్‌కౌంటర్‌పై ఆర్మీ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదుల బృందమొకటి ఖఫ్రిఖన్ పర్వత ప్రాంతం నుంచి నియంత్రణ రేఖ ద్వారా భారత్‌లోకి అడుగుపెట్టి, యూరి, రఫియాబాద్‌లకు దగ్గర్లోని ఖాజీనాగ్ లోయలో సంచరిస్తున్నట్లు సైన్యానికి సాంకేతికపరమైన నిఘా సమాచారం అందింది. దాంతో ఆర్మీ, సరిహద్దు భద్రతాదళం సంయుక్తంగా పెద్ద ఎత్తున గాలింపు ప్రారంభించాయి. బుధవారం ఉదయం వారికి ఆ ఉగ్రవాద బృందం తారసపడింది.
ఆర్మీ మేజర్ నేతృత్వంలోని సైనిక దళం ఉగ్రవాదుల్లో ఒకరిని హతమార్చింది. మిగతావారు తప్పించుకున్నారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆర్మీ అధికారులు గాలింపు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించారు. ఎట్టకేలకు బుధవారం సాయంత్రానికి బారాముల్లాలోని రఫియాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక గుహలో మిగతా టైస్టులు దాక్కున్నట్లు గుర్తించారు. ఈ దశలో గుహ లోపల్నుంచి సైనిక దళంపైకి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దాంతో ఆ ప్రాంతానికి హెలీకాప్టర్ల ద్వారా మరిన్ని సైనిక బలగాలను, ప్రత్యేక సుశిక్షిత బృందాలను పంపించారు.
ఇరువైపుల నుంచి చాలా సేపు వరకు కాల్పులు కొనసాగాయి. చివరగా, గురువారం ఉదయం గుహలో నుంచి ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సైనిక దళాలు గుహలోకి భాష్పవాయు గోళాలను, ఘాటు వాయువులను వెదజల్లే చిల్లీ గ్రెనేడ్లను ప్రయోగించారు. కాసేపటి తరువాత గుహ లోపల్నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం లోపలికి దూసుకెళ్లిన సైనికులకు ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయి కనిపించారు. మరోవైపు, ఓ మూలగా, భయంభయంగా దాక్కున్న సజ్జాద్ అహ్మద్ వారికి కనిపించాడు. తనను చంపవద్దని ఏడుస్తూ వేడుకున్నాడు.
అతడిని గుహలోనుంచి బయటకు తీసుకువచ్చి ఆహారం అందించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కశ్మీర్లోకి పర్వతప్రాంతాల్లో చాన్నాళ్ల పాటు నడిచి రావడంతో వాచిపోయిన కాళ్లకు వైద్యం చేశారు. అనంతరం శ్రీనగర్‌కు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. సజ్జాద్ అహ్మద్‌కు లష్కరే తోయిబా సంస్థ ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదుల నుంచి ఐదు ఏకే 47 తుపాకులు, రెండు గ్రెనేడ్ లాంచర్లు, ఒక మ్యాప్, రెండు జీపీఎస్ పరికరాలు, కొన్ని పగిలిపోయిన స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. భారత్‌లో ఉగ్రదాడుల వెనుక పాక్ హస్తం ఉందనడానికి ఇది మరో సజీవ ఉదాహరణ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన వాదనకు మద్దతుగా ఇది నిలుస్తుందన్నారు. 15 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ సుబ్రతా సాహ వ్యూహం మేరకు.. నియంత్రణ రేఖ వద్ద వ్యూహాత్మకంగా పలు వరుసల్లో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా కశ్మీర్లోకి అడుగుపెట్టేందుకు ఆ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలు పలుమార్లు విఫలమయ్యాయని అధికారులు తెలిపారు.