పాకిస్తాన్కు అంత సీన్ లేదు
పాకిస్తాన్కు అంత సీన్ లేదు
Published Fri, Nov 4 2016 11:30 AM | Last Updated on Mon, Sep 17 2018 5:21 PM
పాకిస్తాన్ రాజకీయాల సామర్థ్యంపై మాజీ విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు శివ్ శంకర్ మీనన్ ఘాటైన విమర్శ చేశారు. భారత్తో సాధారణ సంబంధాలు నెలకొల్పేంత సామర్థ్యం పాకిస్తాన్ రాజకీయాలకు లేదని శివ్శంకర్ మీనన్ అన్నారు. ఇరు అణ్వాయుధ సరిహద్దు దేశాలు శత్రుత్వం నిర్వహించే విధంగానే ఉన్నాయని పేర్కొన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలోని దక్షిణాసియా సెంటర్ నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్లో భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలపై ఆయన ఈ విధంగా నెగిటివ్గా స్పందించారు. పాకిస్తాన్కు భారత హైకమిషనర్గా పనిచేసిన ఈయన, కశ్మీర్ అంశంపై పరిష్కారం కోసం ఎంతో తాపత్రయపడ్డారు. కశ్మీర్కు సంబంధించిన అనేక సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయన్నారు.
చాలామందికి ఈ సమస్యలకు పరిష్కారం తెలిసినప్పటికీ, తేల్చలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ కొట్లాటలతో కశ్మీర్ అంశంపై ఎలాంటి పరిష్కారం కుదరడం లేదన్నారు. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే భారత్తో సాధారణ సంబంధాలు కొనసాగించేంత సామర్థ్యం పాకిస్తాన్కు లేదని వెల్లడవుతుందని పేర్కొన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ అనంతరం పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం భారత్ తగ్గించుకుందని ఆయన గుర్తుచేశారు. ముంబాయి దాడుల అనంతరం సమస్యల పరిష్కారంపై కూడా ప్రజల నుంచి మద్దతు తగ్గిందని, తరుచూ సరిహద్దు తీవ్రవాద దాడులు వీటిని మరింత బలహీనపరిచాయన్నారు. ఈ సమస్యలన్నింటికీ వేగవంతమైన పరిష్కారం దొరుకుతుందని తాను అనుకోవడం లేదన్నారు. చాయిసెస్: ఇన్సైడ్ ది మేకింగ్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాసీ బుక్ను మీనన్ రచించారు.
Advertisement