అప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్ ఎందుకు జరగలేదంటే? | Shivshankar Menon on surgical strike after 26/11 | Sakshi
Sakshi News home page

అప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్ ఎందుకు మిస్సైందంటే..?

Published Sun, Nov 20 2016 5:05 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

అప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్ ఎందుకు జరగలేదంటే?

అప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్ ఎందుకు జరగలేదంటే?

ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. కానీ, 2008 నవంబర్‌ 26 (26/11)న  ముంబైలో ఉగ్రవాదుల నరమేధం అనంతరం కూడా సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశం తెరపైకి వచ్చిందట. అప్పటి విదేశాంగ కార్యదర్శి శివశంకర్‌ మీనన్‌ తాజాగా ప్రచురించిన తన జ్ఞాపకాలు ‘చాయిసెస్‌’  పుస్తకంలో ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

‘ముంబై దాడుల నేపథ్యంలో మురిద్కేలోని ఎల్‌ఈటీపైనో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని దాని శిబిరాలపైనో లేదా ఐఎస్‌ఐపైనో బాహాటంగా తెలిసేరీతిలో ప్రతీకార చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి బలంగా వచ్చింది. ఇలా చేయడం వల్ల భావోద్వేగపరంగా కొంత ఉపశమనం కలిగి ఉండేది. అదేవిధంగా మూడురోజులపాటు ప్రపంచ టెలివిజన్ల సాక్షిగా వెల్లడైన భారత పోలీసులు, భద్రతా దళాల వైఫల్య అవమానం కూడా కొంత తగ్గి ఉండేది’ అని మీనన్‌ పేర్కొన్నారు. ప్రతి చర్యల విషయంలో తాను అప్పటి విదేశాంగమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ని గట్టిగా కోరానని ఆయన తెలిపారు. ఇందుకు ప్రణబ్‌ ముఖర్జీ అంగీకరించినట్టు కనిపించారని పేర్కొన్నారు. తద్వారా మన్మోహన్‌ ఇందుకు అంగీకరించలేదని చెప్పకనే చెప్పేశారు. కానీ ప్రధాని అంగీకరించలేదనే విషయాన్ని అధికారికంగా ఉటంకించలేదు.

ముంబై దాడుల తర్వాత ప్రతీకార దాడుల అంశం తెరపైకి వచ్చిందని అధికారికంగా ధ్రువీకరించిన అప్పటి తొలి ఉన్నతస్థాయి అధికారి మీనన్‌ కావొచ్చునని భావిస్తున్నారు. అంతేకాదు ముంబై దాడులను ఎదుర్కోవడంలో పోలీసులు, భద్రతా దళాలు వైఫల్యం చెందారని, తద్వారా దేశానికి తలవంపులు తెచ్చారని నిక్కచ్చిగా పేర్కొన్న తొలి సీనియర్‌ అధికారి కూడా మీననే. అప్పట్లో పాక్‌పై తగిన ప్రతీకార చర్యలకు దిగకపోవడానికి కేంద్రం భావించిన ఆరు కారణాలను ఆయన ఉటంకించారు. మొదటి కారణం- ఉగ్రవాద దాడి పాకిస్థాన్‌ నుంచే జరిగినప్పటికీ.. అక్కడి ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందనే విషయంలో స్పష్టత లేదు. రెండు- భారత్‌ దాడి వల్ల పాక్‌ ఆర్మీకి ఆ దేశ ప్రజల మద్దతు లభించవచ్చు. అప్పటికే పాక్‌ ఆర్మీ దేశీయంగా తలవంపులు ఎదుర్కొంటున్నది. అంతేకాకుండా భారత్‌ విషయంలో పౌర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మూడు- పాక్‌పై దాడి చేయడం వల్ల ఆ దేశ పౌరప్రభుత్వం మరింత బలహీనం కావొచ్చు. ఆ  దేశ పౌరప్రభుత్వం పాక్‌ ఆర్మీ కన్నా భారతతోనే మంచి సంబంధాలు కోరుకుంటోంది. నాలుగు- ఎంపిక చేసుకున్న ఉగ్రవాద లక్ష్యాలపై పరిమిత దాడి జరుపడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. ఐదు- ఈ దాడి వల్ల ఎంతోకొంత పౌరులకూ నష్టం కలుగవచ్చు. ఆరు- ఈ దాడి వల్ల యుద్ధం సంభవిస్తే.. అది భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ప్రభావం చూపించి ఎదురుదెబ్బగా మారుతుంది. అయితే, పాక్‌ నుంచి మరోసారి ఇలాంటి దాడి జరిగితే.. ప్రతీకార దాడి తప్పి ఉండేది కాదని, ప్రజల మనోభావాల దృష్ట్యా సైనిక చర్య అనివార్యమై ఉండేదంటూ ఆయన ప్రధాని సర్కారు జరిపిన తాజా సర్జికల్‌ స్ట్రైక్స్‌ను పరోక్షంగా సమర్థించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement