Shivshankar Menon
-
'సీఏఏ దేశాన్ని ఏకాకిని చేయబోతోంది'
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై భారత మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏని భారత స్వయంకృత అపరాధంగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో సీఏఏపై నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. సీఏఏ భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశ ఆలోచనను మనం మార్చాలనుకుంటే దాని ఫలితంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా 2015కు ముందు దేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్లు, హిందువులు,సిక్కులు, జైనులు, పార్శీ మతస్తులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అయితే ఈ చట్టం వల్ల సంబంధిత దేశాల నుంచి వచ్చే ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని శివశంకర్ మీనన్ తెలిపారు.( ‘సీఏఏకు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వండి’) ఇదే సమావేశానికి హాజరైన ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మాట్లాడుతూ.. జామియా మిలీయా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడాన్ని తప్పుబట్టారు. సీఏఏపై సరైన సమాచారం ప్రజలకు చేరనందునే పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు సీఏఏపై పూర్తి అవగాహన కల్పిస్తే బాగుంటుందని నజీబ్‌జంగ్ వెల్లడించారు.(ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..) -
అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు జరగలేదంటే?
ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. కానీ, 2008 నవంబర్ 26 (26/11)న ముంబైలో ఉగ్రవాదుల నరమేధం అనంతరం కూడా సర్జికల్ స్ట్రైక్స్ అంశం తెరపైకి వచ్చిందట. అప్పటి విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్ తాజాగా ప్రచురించిన తన జ్ఞాపకాలు ‘చాయిసెస్’ పుస్తకంలో ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ముంబై దాడుల నేపథ్యంలో మురిద్కేలోని ఎల్‌ఈటీపైనో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాని శిబిరాలపైనో లేదా ఐఎస్‌ఐపైనో బాహాటంగా తెలిసేరీతిలో ప్రతీకార చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి బలంగా వచ్చింది. ఇలా చేయడం వల్ల భావోద్వేగపరంగా కొంత ఉపశమనం కలిగి ఉండేది. అదేవిధంగా మూడురోజులపాటు ప్రపంచ టెలివిజన్ల సాక్షిగా వెల్లడైన భారత పోలీసులు, భద్రతా దళాల వైఫల్య అవమానం కూడా కొంత తగ్గి ఉండేది’ అని మీనన్ పేర్కొన్నారు. ప్రతి చర్యల విషయంలో తాను అప్పటి విదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్ని గట్టిగా కోరానని ఆయన తెలిపారు. ఇందుకు ప్రణబ్ ముఖర్జీ అంగీకరించినట్టు కనిపించారని పేర్కొన్నారు. తద్వారా మన్మోహన్ ఇందుకు అంగీకరించలేదని చెప్పకనే చెప్పేశారు. కానీ ప్రధాని అంగీకరించలేదనే విషయాన్ని అధికారికంగా ఉటంకించలేదు. ముంబై దాడుల తర్వాత ప్రతీకార దాడుల అంశం తెరపైకి వచ్చిందని అధికారికంగా ధ్రువీకరించిన అప్పటి తొలి ఉన్నతస్థాయి అధికారి మీనన్ కావొచ్చునని భావిస్తున్నారు. అంతేకాదు ముంబై దాడులను ఎదుర్కోవడంలో పోలీసులు, భద్రతా దళాలు వైఫల్యం చెందారని, తద్వారా దేశానికి తలవంపులు తెచ్చారని నిక్కచ్చిగా పేర్కొన్న తొలి సీనియర్ అధికారి కూడా మీననే. అప్పట్లో పాక్‌పై తగిన ప్రతీకార చర్యలకు దిగకపోవడానికి కేంద్రం భావించిన ఆరు కారణాలను ఆయన ఉటంకించారు. మొదటి కారణం- ఉగ్రవాద దాడి పాకిస్థాన్ నుంచే జరిగినప్పటికీ.. అక్కడి ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందనే విషయంలో స్పష్టత లేదు. రెండు- భారత్ దాడి వల్ల పాక్ ఆర్మీకి ఆ దేశ ప్రజల మద్దతు లభించవచ్చు. అప్పటికే పాక్ ఆర్మీ దేశీయంగా తలవంపులు ఎదుర్కొంటున్నది. అంతేకాకుండా భారత్ విషయంలో పౌర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మూడు- పాక్‌పై దాడి చేయడం వల్ల ఆ దేశ పౌరప్రభుత్వం మరింత బలహీనం కావొచ్చు. ఆ దేశ పౌరప్రభుత్వం పాక్ ఆర్మీ కన్నా భారతతోనే మంచి సంబంధాలు కోరుకుంటోంది. నాలుగు- ఎంపిక చేసుకున్న ఉగ్రవాద లక్ష్యాలపై పరిమిత దాడి జరుపడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. ఐదు- ఈ దాడి వల్ల ఎంతోకొంత పౌరులకూ నష్టం కలుగవచ్చు. ఆరు- ఈ దాడి వల్ల యుద్ధం సంభవిస్తే.. అది భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ప్రభావం చూపించి ఎదురుదెబ్బగా మారుతుంది. అయితే, పాక్ నుంచి మరోసారి ఇలాంటి దాడి జరిగితే.. ప్రతీకార దాడి తప్పి ఉండేది కాదని, ప్రజల మనోభావాల దృష్ట్యా సైనిక చర్య అనివార్యమై ఉండేదంటూ ఆయన ప్రధాని సర్కారు జరిపిన తాజా సర్జికల్ స్ట్రైక్స్‌ను పరోక్షంగా సమర్థించారు. -
పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు
పాకిస్తాన్ రాజకీయాల సామర్థ్యంపై మాజీ విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు శివ్ శంకర్ మీనన్ ఘాటైన విమర్శ చేశారు. భారత్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పేంత సామర్థ్యం పాకిస్తాన్ రాజకీయాలకు లేదని శివ్‌శంకర్ మీనన్ అన్నారు. ఇరు అణ్వాయుధ సరిహద్దు దేశాలు శత్రుత్వం నిర్వహించే విధంగానే ఉన్నాయని పేర్కొన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలోని దక్షిణాసియా సెంటర్ నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్లో భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలపై ఆయన ఈ విధంగా నెగిటివ్‌గా స్పందించారు. పాకిస్తాన్‌కు భారత హైకమిషనర్‌గా పనిచేసిన ఈయన, కశ్మీర్ అంశంపై పరిష్కారం కోసం ఎంతో తాపత్రయపడ్డారు. కశ్మీర్‌కు సంబంధించిన అనేక సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చాలామందికి ఈ సమస్యలకు పరిష్కారం తెలిసినప్పటికీ, తేల్చలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ కొట్లాటలతో కశ్మీర్ అంశంపై ఎలాంటి పరిష్కారం కుదరడం లేదన్నారు. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే భారత్‌తో సాధారణ సంబంధాలు కొనసాగించేంత సామర్థ్యం పాకిస్తాన్‌కు లేదని వెల్లడవుతుందని పేర్కొన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ అనంతరం పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం భారత్ తగ్గించుకుందని ఆయన గుర్తుచేశారు. ముంబాయి దాడుల అనంతరం సమస్యల పరిష్కారంపై కూడా ప్రజల నుంచి మద్దతు తగ్గిందని, తరుచూ సరిహద్దు తీవ్రవాద దాడులు వీటిని మరింత బలహీనపరిచాయన్నారు. ఈ సమస్యలన్నింటికీ వేగవంతమైన పరిష్కారం దొరుకుతుందని తాను అనుకోవడం లేదన్నారు. చాయిసెస్: ఇన్సైడ్ ది మేకింగ్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాసీ బుక్‌ను మీనన్ రచించారు.