పాక్‌లో లింగమార్పిడి పెళ్లిళ్లకు అనుమతిస్తూ ఫత్వా
కరాచి: లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆడ, మగైతే వారిద్దరు పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం అనుమితిస్తోందంటూ పాకిస్థాన్‌లోని ఓ మత గురువుల బృందం ఇటీవల ఓ ఫత్వా జారీ చేసింది. వారికి వారసత్వ హక్కు కూడా వర్తిస్తుందని, మరణానంతరం వారిని ముస్లిం శ్మశానంలో ఖననం చేసేందుకు అనుమతి కూడా ఉంటుందని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. అయితే పెళ్లి చేసుకోబోయే ఆడ, మగలు తమ శరీరాలపై తాము ఆడ, మగ అంటూ సూచించే గుర్తులు కలిగి ఉండాలని ఫత్వాలో షరతు విధించారు.
లింగమార్పిడి చేసుకున్న ఆడ లేదా మగను సాధారణ స్త్రీ, పురుషులు కూడా పెళ్లి చేసుకోవచ్చని, అయితే శరీరాన్ని సూచించే లింగం గుర్తులు మాత్రం లింగమార్పిడి చేసుకున్న వారికి తప్పనిసరిగా ఉండాలని ఫత్వాలో పేర్కొన్నారు. సాధారణ పౌరులకు మాత్రం ఈ గుర్తులు అవసరం లేకపోవడమే కాకుండా, గుర్తులు ఉండడం కూడా ఇస్లాంకు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. అసలు ఈ గుర్తులు ఎందుకు అవసరమనే విషయాన్ని మాత్రం ఫత్వాలో ఎక్కడా వివరించలేదు.
లాహోర్‌లోని ‘టాంజీమ్ ఇత్తెహాద్ ఇ-ఉమ్మత్ పాకిస్తాన్’ అనే సంస్థకు చెందిన యాభై మంది మత గురువులు జారీ చేసిన ఈ ఫత్వా ప్రతిని తాజాగా మీడియా సేకరించింది. ఈ మత గురువుల సంస్థ చిన్నదే అయినప్పటికీ, దానికి చట్టబద్ధత లేకపోయినప్పటికీ ఇలాంటి పెళ్లిళ్లను అనుమతిస్తూ ఫత్వా జారీ చేయడం ఓ ఇస్లామిక్ దేశంలో విశేషం. లింగమార్పిడి పౌరులకు సమాన హక్కులు కల్పిస్తూ 2012లోనే పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వారికి వారసత్వ హక్కులను కూడా కల్పించింది. అయితే వారికి ఓటు హక్కు రావడానికి మాత్రం ఓ ఏడాది కాలం పట్టింది. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్ల మధ్య పెళ్లిళ్లను మాత్రం కోర్టులుగానీ, షరియా చట్టాలుగానీ పాకిస్థాన్‌లో ఇప్పటికీ అనుమతించడం లేదు. దేశంలో 19 కోట్ల మంది స్వలింగ సంపర్కులు ఉన్నారు. వారిని అక్కడి సమాజం ఇప్పటికీ గుర్తించకపోవడం వల్ల వారు అడుక్కోవడం లేదా వ్యభిచారం చేయడం ద్వారా బతుకుతున్నారు.