
మోదీతో పళని భేటీ.. ఆసక్తికర నిర్ణయం!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసంలో వీరి భేటీ జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మోదీ-పళని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో మోదీ సర్కారుకు పళనిస్వామి మద్దతునివ్వవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మోదీని కలిసిన అనంతరం పళనిస్వామి మీడియాతో తెలిపారు.
జయలలిత తర్వాత అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోగా.. అందులో అతిపెద్ద వర్గానికి పళని నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని మరో ప్రత్యర్థి వర్గం ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతునివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి వర్గం కూడా బీజేపీకి మద్దతునిస్తే.. రాష్ట్రపతి ఎన్నికలను సునాయసంగా గట్టెక్కవచ్చునని కమలనాథులు భావిస్తున్నారు.
వచ్చే జూలైలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్డీయేకు 51శాతం ఎలక్టోరల్ కాలేజీ మద్దతు అవసరముంది. ప్రస్తుతం బీజేపీకి 48.5శాతం ఎలక్టోరల్ ఓట్ల మద్దతు ఉండగా, అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు సంపూర్ణ మెజారిటీ సాధించాలని బీజేపీ కోరుకుంటోంది.