మృతుడు రాజు
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఔటర్ ఢిల‍్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో పానీపూరీ అమ్ముకునే వ్యక్తిని కొంతమంది కలిసి దారుణంగా చంపేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు బాలనేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా బాగా తాగేసి ఉన్నారు. వాళ్లకు అర్ధరాత్రి సమయంలో పానీపూరీ ఇచ్చేందుకు రాజు (24) నిరాకరించడంతో వాళ‍్లు అతడిని 18 సార్లు కత్తితో పొడిచారు. హత్యలో తమ పాత్ర ఉన్నట్లు ఈ ఐదుగురూ అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో గోగి (22), అనిల్ (28), నిఖిల్ (24) అనే ముగ్గురిని అరెస్టు చేశారు.
రాజు తన కుటుంబంతో కలిసి మంగోల్‌పురి బ్లాక్ 1లో నివసించేవాడు. రోడ్డు పక్కన తన తండ్రి రాధేశ్యామ్‌తో కలిసి పానీపూరీ, ఇతర స్నాక్స్ అమ్మేవాడు. రాత్రి 11.30 గంటల సమయంలో అతడు తన షాపు కట్టేసి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అతడి తండ్రి కాస్త ముందు వెళ్తూ దాదాపు ఇంటికి చేరుకున్నాడు. అంతలో ఐదుగురు వ్యక్తులు మద్యం తాగుతూ రాజును ఆపి పానీపూరీ అడిగారు. అయితే సరుకులు అయిపోయాయని, ఇప్పుడు ఇవ్వలేనని రాజు చెప్పాడు. అయినా సరే తమకు కావల్సిందేనని వాళ్లు పట్టుబట్టారు. రాజు నిరాకరించడంతో వాళ్లలో ఒకడు కత్తితీసి రాజు పడిపోయేవరకు పొడిచాడు. అతడి అరుపులు విన్న తండ్రి, ఇరుగు పొరుగువారు అక్కడకు వచ్చేసరికి నిందితులు పారిపోయారు. వాళ్లలో ఇద్దరిని పట్టుకున్నారు. రాజును సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. గోగి, అనిల్ ఇద్దరికీ గతంలో నేరచరిత్ర ఉంది. నిఖిల్‌కు నేరచరిత్ర లేదు గానీ, అలాంటివాళ్లతో కలిసి తిరిగేవాడు.