కోర్టులో పిస్టోరియస్ కు ఊరట
ప్రిటోరియా: తన ప్రియురాలు రీవా స్టెన్ క్యాంప్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ కు కోర్టులో ఊరట లభించింది. 2013 లో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్ క్యాంప్ ను హత్య చేసాడంటూ అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం విచారణకు స్వీకరించిన దక్షిణాఫ్రికా హైకోర్టు.. పిస్టోరియన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేయలేదంటూ పేర్కొంది. ప్రియురాలు రీవా స్టీన్ క్యాంప్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పిస్టోరియస్ ను ముద్దాయిగా నిర్ధారించే సరైన సాక్ష్యం లేవని తెలిపింది.
అయితే తీర్పు పాఠం పూర్తిగా చదివి వినిపించేందుకు మరో రెండు రోజులు సమయం పడుతుందని స్పష్టం చేసింది. 'పిస్టోరియన్ కావాలని ఆమెను హత్య చేసినట్లు నిరూపణ కాలేదు. అందుకు సంబంధించిన సాక్షాలను కూడా పోలీసులు సేకరించలేదు. దీన్ని బట్టి తన వద్ద నున్న గన్ తో కాల్పులు జరిపినా.. స్వతహాగా ఆమెను చంపడానికి యత్నించలేదని స్పష్టమవుతోంది' అంటూ కోర్టు తెలిపింది. అయితే తుది తీర్పును ఇంకా కోర్టు వెలువరించాల్సి ఉంది. 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపినట్టు కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు.