విజయవంతంగా ‘ఆపరేషన్ ముస్కాన్’
సత్ఫలితాలిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లు
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారించి.. బాలల అప్పగింత
హైదరాబాద్: ఇంటినుంచి పారిపోయి వీధి బాలలుగా మారిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ కార్యక్రమం అమలు బాధ్యతను మహిళా శిశు సంక్షేమ, పోలీసు శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల నిమిత్తం పోలీసు, కార్మిక, శిశు సంక్షేమ, విద్యా శాఖల నుంచి ఒక్కో అధికారి, స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థల నుంచి మరికొందరు సభ్యులుగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రధాన కూడళ్ల వద్ద భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, కాగితాలు ఏరుకునే వారు, రైల్వే ఫ్లాట్‌ఫారాలపై ఉంటున్నవారు, దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి.. వారందరినీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాలకు తరలిస్తారు. బాలల నుంచి వారి స్వస్థలం, కుటుంబ వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందజేస్తారు. ఆపై ఎవరైనా తామే తల్లిదండ్రులమని తగిన గుర్తింపు పత్రాలతో వస్తే.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ల సమక్షంలో విచారించి బాలలను అప్పగిస్తారు.
వారం రోజుల్లో 970 మంది పట్టివేత
వారం రోజులుగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో బాలల పరిరక్షణ బృందాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 970 మంది బాలలను పట్టుకున్నారు. వీరిలో బాలకార్మికులే ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో దొరికిన బాలలను ఆయా జిల్లా కేంద్రాల్లోని తాత్కాలిక వసతి గృహాల్లో ఉంచి, చదువు నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ముస్కాన్‌ను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ఆపరేషన్ ముస్కాన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) నుంచి నిధులను కేటాయించారు.
తల్లిదండ్రుల వద్దకు వీధి బాలలు
Published Sun, Jul 19 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement
Advertisement