
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
*12 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం
* పొడిగించాలని కోరుతున్న ప్రతిపక్షాలు
* 38 బిల్లులు ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వ యోచన
* వాటిలో లేని టీ-బిల్లు.. త్వరగానే తెస్తామంటున్న ప్రధాని
* ధరలే ప్రధానాస్త్రంగా దాడి చేయనున్న ప్రతిపక్షాలు
* సభలు నేడు, రేపు వాయిదా పడే అవకాశం
* తర్వాత భేటీలపై అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ: అందరూ ఎదురుచూస్తున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజులపాటు సాగనున్న ఈ భేటీల్లో చాలా బిల్లులు ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా.. మరోవైపు ఈ సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ మొదలుపెట్టాయి. ఈ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడతారా లేదా అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
బిల్లును తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు.. పార్లమెంటు సమావేశాలు జరిగే తీరును నిర్ణయించనున్నాయని తెలుస్తోంది. సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై తమదైన శైలిలో దాడి చేయడానికి ప్రతిపక్షాలు ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి. మొదటి రోజు నుంచే ఈ దాడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధరల అంశంపై వాయిదా తీర్మానాలు పెట్టాలని బీజేపీ, వామపక్షాలు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి.
38 బిల్లుల్లో లేని తెలంగాణ: ఈసారి 38 బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నా.. వాటిలో తెలంగాణ బిల్లు లేదు. దీనిపై తెలంగాణవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. వీలైనంత త్వరగా బిల్లు తీసుకురావడానికి యత్నిస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోఎం ఈ తెలంగాణ ముసాయిదా బిల్లు రూపొందిస్తోంది. సంప్రదాయం ప్రకారం.. మొదట కేబినెట్ ఆమోదించాక ఆ బిల్లు రాష్ట్రపతికి వెళుతుంది. ఆయన దాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపాల్సి ఉంటుంది. అసెంబ్లీకి బిల్లు పంపుతామని ప్రభుత్వం పైకి చెబుతున్నప్పటికీ.. దీనిపై సమైక్యవాదుల్లో సందేహాలున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లు, లోక్‌పాల్ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఈసారి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
నేడు, రేపు వాయిదా?: పార్లమెంటు సమావేశాలు గురువారం నుంచి ప్రారంభిస్తున్నప్పటికీ.. ఉభయ సభల్లో సోమవారం నుంచి మాత్రమే సభా వ్యవహారాలు జరిగే అవకాశముంది. ఇటీవల మరణించిన ఎస్పీ రాజ్యసభ ఎంపీ మోహన్ సింగ్, బీజేపీ లోక్‌సభ ఎంపీ మురారి లాల్ సింగ్‌లకు నివాళులర్పించాక గురువారం సమావేశాలు వాయిదా పడే అవకాశముంది. బాబ్రీ మసీదు విధ్వంస దినమైన డిసెంబరు 6న ఇంతవరకు ఏనాడూ సమావేశాలు సజావుగా సాగలేదు. ఈసారీ అది పునరావృతమయ్యే అవకాశముంది. ఆ తర్వాత సమావేశాలు ఎలా సాగుతాయన్నది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉందని రాజ్యసభలో బీజేపీ ఉప నాయకుడు రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో వ్యాఖ్యానించారు. సభా సమావేశాలను పొడిగించాలని డిమాండ్ వస్తున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే అది ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఫలితాలు ఆదివారం వెలువడనుండగా.. మిజోరం ఫలితాలు సోమవారం రానున్నాయి.
కాగా నిత్యావసర ధరలు, తెలంగాణ అంశాలతోపాటు.. పాట్నా ర్యాలీ పేలుళ్ల నేపథ్యంలో అంతర్గత భద్రత, మహిళలపై పెరుగుతున్న అరాచకాలు, సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనా, పాకిస్థాన్ అంశాలను కూడా సభలో చర్చకు తేవాలని బీజేపీ యోచిస్తోంది. ముజఫర్‌నగర్ అల్లర్లు, ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదలపై చర్చించాలని వామపక్షాలు పట్టుబట్టనున్నాయి. ఈ సమస్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దిగువ సభ సజావుగా సాగడానికి సహాయం చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ బిల్లుపై ఒత్తిడి తేనున్న ఎన్డీఏ
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాం డ్ చేయనున్నట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బుధవారం ప్రకటించింది. అంతర్గత భద్రత, మహిళలపై హింస, నిత్యావసరాల ధరల పెరుగుదల, 2జీ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న జేపీసీ వంటి రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడం వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టనున్నట్లు తెలిపింది. తెలంగాణ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నామని, అయితే ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలను కలపడం అనైతికమని భావిస్తున్నామని రాజ్యసభలో బీజేపీ ఉపనేత రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. ఉభయ సభల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపడాన్ని ఎన్డీఏ వ్యతిరేకిస్తుందన్నారు. లోక్‌సభకు బహుశ ఇవే చివరి సమావేశాలు కానున్నందున సభా కార్యకలాపాలు కొనసాగాలనే తాము కోరుకుంటున్నామన్నారు.