మహారాష్ట్రలో సోషల్ మీడియాకు పార్టీల జై
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మహారాష్ట్రలో పార్టీలన్నీ సోషల్ మీడియా జపం చేస్తున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆన్‌లైన్ ప్రచారం మంచి ఫలితాలు ఇవ్వడంతో మిగతా పార్టీలు కూడా అదే దారిని ఎంచుకున్నాయి. ముఖ్యంగా గత 15 ఏళ్లుగా అధికార కూటమిలో పాలుపంచుకొని, ప్రస్తుతం ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎన్సీపీ.. సామాజిక మాధ్యమానికి పెద్దపీట వేస్తోంది. ఇక ఆన్‌లైన్ ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీల కంటే ముందుంది. పార్టీ అభ్యర్థులు వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కూడా ఆన్‌లైన్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సామాజిక మాధ్యమంలో ప్రచార బాధ్యతలను కట్టబెడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఇన్‌చార్జిలను ఏర్పాటు చేసుకుంది.