చేతి చమురు వదుల్తోంది..
స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలికి జరగాల్సిన ఎన్నికలకు షెడ్యూల్ ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు మాత్రం ఇప్పటి నుంచే సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోందని లబోదిబోమంటున్నారు. నల్లగొండ జిల్లాలో అయితే ఓ పార్టీ అభ్యర్థి (టికెట్ ఖరారైంది) ఓటర్లుగా ఉన్న ప్రజా ప్రతినిధులకు డబ్బులు కూడా ముట్టజెప్పారు. అయినా జిల్లాలో పర్యటించాలంటేనే ఆయన హడలిపోతున్నారు. ఎన్నికలు వచ్చేదాకా తమ ఖర్చులు భరించాల్సిందే అంటున్నారు ఓటర్లు. పెళ్లిళ్లకు, పండగలకు, ఉత్సవాలకు ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందో... ఎమ్మెల్సీ పదవి లేకున్నా బాగుండేదని సన్నిహితులతో వాపోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేవరకు ఎంత చమురు వదిలించుకోవాల్సి వస్తుందో అంటూ పోటీ చేయాలనుకుంటున్నవారు తెగ బాధపడిపోతున్నారు.