
తెలంగాణ ఏర్పాటు జాతి నిర్ణయం: ప్రధాని
న్యూఢిల్లీ: 15వ పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల ముగింపు సందర్భంగా లోక్సభలో ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ మీరా కుమార్, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు జాతి నిర్ణయమని ప్రధాని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా ఈ దేశం నిర్ణయాలు తీసుకోగలదని నిరూపించిందన్నారు. తమ పనితీరును నిర్ణయించేందుకు ప్రజలకు ఓ అవకాశం వచ్చిందన్నారు. స్పీకర్కు, మిగతా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
మొదటి మహిళా స్పీకర్గా తనను ఎన్నుకున్నందుకు సభ్యులకు స్పీకర్ మీరాకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సభలో మరింత మంది మహిళా సభ్యులు ఉంటే సంతోషంగా ఉండేదన్నారు. వచ్చే సభలో మరింత మంది మహిళా ఎంపీలు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ స్పందించిన తీరును స్పీకర్ గుర్తు చేసుకున్నారు. లోక్పాల్ బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని విపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు.