సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేరుతాయని, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా అట్టడుగున ఉన్న ప్రజానీకం ఆశలు తీరుతాయని ఆశించినా నెరవేరలేదని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసే అర్హులైన దళిత నాయకుల్లేరా.. లేక మీకు ఇష్టం లేకనే దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదా అని ఆమె ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, సంపత్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌తో కలసి ఆమె మాట్లాడారు. ఓవైపు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు.. మరోవైపు రాజకీయ అణచివేతకు పాల్పడుతూ ఆ వర్గాలను నిరాశ, నిస్పృహల్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో పరిపాలన తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఎలాంటి తప్పు చేయకుండానే దళిత ఎమ్మెల్యే సంపత్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, ప్రజా సమస్యలపై మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్క తీర్మానంతో మొత్తం ప్రతిçపక్షాన్నే అసెంబ్లీ నుంచి గెంటివేయడం ప్రజాస్వామ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు. తాను కూడా స్పీకర్‌గా పనిచేశానని, ఎంతోమంది సభ్యులు వారి అభిప్రాయాలను వెలిబుచ్చేవారని, అంతమాత్రాన వారి నోరునొక్కే విధంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేకపోవడం, భావస్వేచ్ఛను హరించడం దురదృష్టకరమన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించడం లేదని, 4వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంటే తనకు గౌరవమని, గత పర్యటనలో తాను నేరెళ్ల వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో పేదలు, మైనార్టీలు, రైతులు, దళితులు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలను అణచివేసేలా పాలన సాగుతోందని విమర్శించారు.
చారిత్రక చట్టాన్ని తెచ్చింది మేమే..
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించే చారిత్రక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని మీరాకుమార్ గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తాను కూడా ఎంపీనని, ఆ సమయంలో బిహార్ రాష్ట్రంలోని జహానాబాద్ జిల్లాలో 27 మంది దళితులను కాల్చి చంపారన్నారు. ఈ ఘటనలతోనే ఎస్సీ, ఎస్టీల మనోభావాలను కాపాడేందుకు పటిష్ట చట్టం కావాలని తాను నాడు రాజీవ్‌కు చెప్పానని, అప్పుడే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడా చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని, అయినా ఆ సమావేశాల్లో చట్టం తెచ్చే ప్రయత్నం బీజేపీ చేయలేదన్నారు. సమావేశాల తర్వాత కూడా ఆర్డినెన్స్ తెచ్చే అవకాశమున్నా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం విషయంలో కోర్టులో బలమైన వాదనలు కూడా వినిపించేందుకు బీజేపీ ముందుకు రాలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా వెలుగులోకి తెస్తున్న మీడియాను ఆమె అభినందించారు.
మీరా సానుకూలత వల్లే తెలంగాణ: ఉత్తమ్
మీరాకుమార్ నాడు స్పీకర్‌గా సానుకూలంగా వ్యవహరించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదించే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరాకుమార్ వెనక్కు వెళ్లలేదని, ఆమె అలా వ్యవహరించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదన్నారు. తెలంగాణ ప్రజలపై ఉన్న మక్కువతోనే ఆమె రాష్ట్రంలో తరచూ పర్యటిస్తున్నారని, తెలంగాణ ప్రజలు కూడా మీరాకుమార్‌ను గుండెల్లో పెట్టుకున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment