పెన్షన్ స్కీమ్‌ల్లో పెట్టుబడి పెట్టడం కన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచి రాబడులనిస్తుందని నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం సరైనదేనా? రిటైరైన తర్వాత అవసరాల కోసం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హై గ్రోత్ కంపెనీస్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన ఫండేనా? వివరించగలరు.
-గోపీనాధ్, హైదరాబాద్
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)తో పాటు పలు బీమా కంపెనీలు పెన్షన్ స్కీమ్‌లను అఫర్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం రిటైర్మెంట్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇలాంటి స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడులను పొందవచ్చు. ఎన్‌పీఎస్‌లో మీకు 60 ఏళ్లు వచ్చేదాకా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసుకోవడానికి వీలులేదు. మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్, వాటిపై వచ్చిన రాబడుల్లో 40 శాతం యాన్యుటీగా మార్చుకోవలసి ఉంటుంది. పలు బీమా కంపెనీలు ఆఫర్ చేసే పెన్షన్ స్కీమ్‌లు సైతం ఈ విధంగానే ఉంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్‌లు సైతం ఇదే తరహా లాక్-ఇన్ పీరియడ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇలా కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. రాబడులు కూడా అధికంగానే ఉంటాయి. మీ ఆర్థిక క్రమశిక్షణకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. మీరు ఎంచుకున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హై గ్రోత్ కంపెనీస్ ఫండ్ చాలా మంచి ఫండ్. ఇలాంటి ఫండ్‌ను మరో ఒకటి లేదా రెండును ఎంపిక చేసుకొని వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, ఎన్‌పీఎస్ కన్నా, బీమా కంపెనీల పెన్షన్ స్కీమ్‌ల కన్నా, మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ స్కీమ్‌ల కన్నా మంచి రాబడులు పొందవచ్చు.
మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విక్రయం వల్ల లభించే ఎగ్జిట్ లోడ్ మొత్తాన్ని ఏం చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఎక్స్‌పెన్స్ రేషియో, ఆ మ్యూ చువల్ ఫండ్ మొత్తం వ్యయాలను సూచిస్తుందా? ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్ సంస్థ మరేమైనా చార్జీలను విధిస్తుందా?
- నందిని, విశాఖపట్టణం
మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు త్వరగా బయటపడకుండా ఉండటానికి గాను ఎగ్జిట్ లోడ్‌ను విధిస్తారు. గతంలో ఎగ్జిట్ లోడ్ ద్వారా వచ్చిన మొత్తాలను ఫండ్ మేనేజర్లు తమ వ్యయాల కోసం వినియోగించుకునేవాళ్లు. ఇప్పుడు ఈ ఎగ్జిట్ లోడ్ మొత్తాలను తిరిగి అదే స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లకు అధిక రాబడులు వస్తాయి. మ్యూచువల్ ఫండ్ యాజమాన్య, నిర్వహణ తదితర వ్యయాల మొత్తాన్ని ఎక్స్‌పెన్స్ రేషియో సూచిస్తుంది. ఈ ఎక్స్‌పెన్స్ రేషియోలో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్వైజరీ ఫీజు, ట్రస్టీ ఫీజులు, ఆడిట్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ వ్యయాలు, మార్కెటింగ్ , విక్రయాల వ్యయాలు, ఏజెంట్ల కమిషన్, ఇన్వెస్టర్ కమ్యూనికేషన్స్ సంబంధిత వ్యయాలు, ఫండ్ బదిలీ వ్యయాలు, అకౌంట్ స్టేట్‌మెంట్, డివిడెండ్ రిడంప్షన్ చెక్‌లు, వారంట్లు ఇన్వెస్టర్లకు పంపించడానికి అయిన వ్యయాలు, ప్రకటనల వ్యయాలు, ఇన్వెస్టర్ల అవగాహన సంబంధిత ఖర్చులు, బ్రోకరేజ్, లావాదేవీల వ్యయాలు, సర్వీస్ ట్యాక్స్, లిస్టింగ్ వ్యయాలు వంటి ఇతర వ్యయాలు ఉంటాయి. ఈ వ్యయాలన్నీ సెబీ నిర్దేశిత పరిమితికి లోబడి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో టాప్ 15 నగరాల నుంచి కాకుండా ఇతర చిన్న నగరాల నుంచి ఇన్వెస్టర్లు నిర్దేశిత పరిమితిలో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ సంస్థలు అదనంగా 0.3% వరకూ ఎక్స్‌పెన్స్ రేషియో వసూలు చేసుకోవడానికి ఇటీవలనే సెబీ అనుమతిచ్చింది.
నేను 2005లో రూ.2 లక్షలు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నా ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ రూ.10 లక్షలుగా ఉంది. నేను 20 శాతం ఆదాయపు పన్ను స్లాబ్‌లో ఉన్నాను. నేను ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, నేను ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? నా ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఈ రిడంప్షన్ మొత్తాన్ని ఎలా చూపించాలి? ఈ మొత్తాన్ని నా మొత్తం ఆదాయానికి జత చేస్తే నేను 30 శాతం ఆదాయపు పన్ను స్లాబ్‌లోకి వెళ్లిపోతాను. నేను ఏం చేయాలి?
- జాన్సన్, గుంటూరు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఆర్జించిన రాబడులపై ఎలాంటి దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. రూ.2 లక్షల ఇన్వెస్ట్‌మెం ట్స్‌పై మీరు పొందిన రూ.8 లక్షల రాబడిపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఆదాయపు పన్ను స్లాబ్‌లో ఉన్నా ఇది వర్తిస్తుంది. మీరు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది లోపే విక్రయించిన పక్షంలో అప్పుడు 15% షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయిస్తే, మీ ఆదాయపు పన్ను రిటర్నుల్లో మూలధన లాభాల ఆదాయం కింద ఈ మొత్తాన్ని పేర్కొనాల్సి ఉంటుంది.
పెన్షన్ స్కీమ్‌లా..? మ్యూచువల్ ఫండ్‌లా?
Published Mon, Mar 23 2015 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM
Advertisement
Advertisement